ఒత్తిళ్లకు తలొగ్గవద్దు
ఆళ్లగడ్డ: అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో ఆదివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉన్నవారి పింఛన్‌లను తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. ఆరు మండలాలకు మంజూరైన ఎస్సీ కార్పొరేషన్ నిధుల వివరాలను తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కింద ఉపయోగకరమైన పనులను గుర్తించాలని చెప్పారు. దొర్నిపాడు మండలంలోని అర్జునాపురం, ఆళ్లగడ్డ మండలంలోని శాంతినగరం గ్రామాల్లో రెండు నెలల నుంచి పింఛన్‌లు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. కొటకందుకూరు గ్రామంలో 200కుపైగా పింఛన్‌లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. శిరివెల్ల మండలంలోని కప్పలకుంటలో తాగునీటి కోసం శోభానాగిరెడ్డి హయూంలో విడుదలైన రూ.29 లక్షల నిధులకు సంబంధించి టెండర్‌లు జరిగాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు.