కలయిక ప్రమాదమా? | funday crime story | Sakshi
Sakshi News home page

కలయిక ప్రమాదమా?

Published Sun, Apr 22 2018 12:45 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

funday crime story - Sakshi

నాకు పెళ్లై ఇంకా సంవత్సరం కాలేదు. నాకు ఇప్పుడు నాలుగో నెల. మూడు నెలల పాటు భార్యభర్తలు కలవద్దు అన్నారు. కానీ మేము కలిశాం. నాలుగో నెల నుంచి అయితే కలవొచ్చు అన్నారు. మొదటి మూడు నెలలు కలిశాము కదా... బిడ్డకు ఏమైనా హాని కలుగుతుందా? దయచేసి సలహా ఇవ్వగలరు.                                                                      
– ఎ.ఆర్‌. విశాఖపట్టణం

గర్భం దాల్చిన తర్వాత, అది నిలవడానికి మొదటి మూడు నెలలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా మొదటి మూడు నెలలు భార్యాభర్తలు దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. కొంతమందిలో పొత్తికడుపు, గర్భాశయం పైన ఒత్తిడి, కుదుపు వల్ల బ్లీడింగ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరిలో గర్భం బలహీనంగా ఉన్నప్పుడు అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్త తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. అలా అని అందరిలో సమస్య ఉండాలని ఏమీలేదు. ఇప్పుడు మీరు నాలుగో నెలలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏమీ కాలేదు కాబట్టి అయిపోయిన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హాని జరిగి ఉంటే ఈ సమయానికే తెలిసిపోయేది. కాబట్టి అనవసరంగా భయపడకుండా ప్రెగ్నెన్సీని ఆనందంగా ఆస్వాదించండి.

‘పీరియడ్‌ పెయిన్‌’ తగ్గించడానికి  కొన్ని స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని విన్నాను. ఇది  ఎంత వరకు నిజం? ఒకవేళ వాస్తవం అయితే ఈ యాప్‌ ఏ రకంగా ఉపయోగపడుతుందో వివరించగలరు. – ఎన్‌.స్వాతి, విజయనగరం
పీరియడ్‌ పెయిన్‌ తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ఒకటి అందుబాటులో ఉంది. జర్మనీలోని పరిశోధకులు, చైనాలోని పరిశోధకులతో కలిసి.. కొంతమందిపైన ఆక్యూప్రెజర్‌ పద్ధతిని వాడారు. అది సత్ఫలితాలను ఇచ్చాక ఆ పద్ధతిని యాప్‌గా మార్చడం జరిగింది. పొత్తి కడుపుపైన కొన్ని ప్రదేశాలపై ఆక్యూప్రెజర్‌.. అంటే చేతి వేళ్లతో మసాజ్‌ చేయడం వల్ల చాలామందిలో అంటే యాభైశాతానికి పైన పీరియడ్స్‌ సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగిందని పరిశోధకుల విశ్లేషణ. ఈ అంశంపైన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో పొత్తికడుపు పైన ఎక్కడ ఎలా మసాజ్‌ చేయాలో చూపించడం జరుగుతుంది. ఆ యాప్‌లో రిమైండర్స్‌ వస్తూ ఉంటాయి. అలాగే అందులో వారి పీరియడ్స్‌ తారీఖు, ఎన్నిరోజులు బ్లీడింగ్, నొప్పి ఉంటుంది వంటి అనేక విషయాలను పంపించిన తర్వాత ఆక్యూప్రెజర్‌ పద్ధతి  ఎప్పుడు, ఎన్నిసార్లు చేయాలనే విషయం దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్స్‌ మొదలయ్యే అయిదు రోజుల ముందు నుంచి, పీరియడ్స్‌ పూర్తయ్యే వరకు రోజుకు ఒకటి లేదా రెండు, మూడుసార్లు యాప్‌లో చూపినట్లు ఆయా ప్రదేశాలపై మసాజ్‌ చేయాలి. దానివల్ల చాలామందికి నొప్పి నుంచి యాభైశాతానికి పైన నొప్పి తగ్గే అవకాశాలు ఉండొచ్చు. దీనివల్ల నొప్పి నివారణ మాత్రలు వాడే పరిస్థితి తగ్గొచ్చు. స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవుపెట్టే రోజులు తగ్గుతాయి. సమస్యేమీ లేకుండా వచ్చే పీరియడ్స్‌ నొప్పికి ఈ యాప్‌ వాడి చూడొచ్చు. కానీ ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి వారి సలహామేరకు వాడటం మంచిది.

గర్భానికి ముందు స్త్రీలు ‘ఫిట్‌నెస్‌’తో ఉండడం వల్ల, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని చదివాను. ఈ ‘ఫిట్‌నెస్‌’ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? జెస్టేషనల్‌ డయాబెటిస్‌ గురించి తెలియజేయగలరు. – బి.శోభన, కంకిపాడు
గర్భం రాకముందు నుంచే స్త్రీలు బరువు ఎక్కువ, తక్కువ లేకుండా వారి పొడుగుకి తగ్గ బరువు ఉండటం చాలా అవసరం. ఎక్కువ బరువు ఉండటం వల్ల గర్భం దాల్చిన తర్వాత, ఇంకా బరువు పెరుగుతారు. దానివల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్‌ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ తక్కువ బరువు ఉండి పోషకాహార లోపం ఉన్నప్పుడు... గర్భం దాలిస్తే రక్తహీనత వంటి సమస్యల వల్ల బిడ్డ బరువు పెరగకపోవడం, అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు వంటి అనేక ఇబ్బందులు ఏర్పడొచ్చు. కాబట్టి గర్భం రాకముందే బరువు ఎక్కువగా ఉన్నవారు వాకింగ్, యోగా వంటి వ్యాయామాలతో పాటు ఆహారంలో అన్నం తక్కువ తినడం, కొవ్వు పదార్థాలు తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకొని బరువు తగ్గడం మంచిది. బరువు మరీ తక్కువగా ఉండి, రక్తహీనత వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ వంటిని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలో షుగర్‌ శాతం పెరిగి మధుమేహం రావడాన్ని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఇది ప్రెగ్నెన్సీలో కొందరిలో కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, కుటుంబంలో షుగర్‌ ఉన్నవాళ్లలో, బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఇంకా కొన్ని కారణాల వల్ల రావచ్చు. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ను రక్తంలో ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్‌ లేదా జీసీటీ, ఓజిటీటీ వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీనికి డాక్టర్‌ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తూ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అవసరమైతే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ల ద్వారా నియంత్రణలో ఉంచుకోవలసి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా పెరుగుతాయి. దాంతో ప్రెగ్నెన్సీలో అబార్షన్లు, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, బిడ్డలో లోపాలు, బిడ్డ ఎక్కువ బరువు పెరగడం, కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడొచ్చు.

డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement