
‘ఆదివాసీ, లంబాడాల మధ్య గొడవల నేపథ్యంలో వేరే జిల్లా నుంచి వచ్చాం. దాదాపు 15 రోజులు కావస్తోంది. కోరలు చాచే చలిలో రాత్రిళ్లు విధులు నిర్వహిస్తున్నాం. పదిరోజుల నుంచి భార్య పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు బందోబస్తు నిర్వహించాలో తెలియడం లేదు. సిబ్బంది కొరతతోనే ఈ పరిస్థితి ఉంది. వాతావరణం అలవాటు లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాం.’ – బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు మనోగతం..
బోథ్ : జిల్లాలోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో తగినంతా సిబ్బంది లేరు. చాలా మండలాల్లో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపైనే పని భారం పెరుగుతోంది. వాస్తవానికి జనాభా, నేరాల నమోదు ఆధారంగా ఒక్కోస్టేషన్‌కు 25నుంచి 50 మంది సిబ్బంది ఉండాలి. అందులో ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, మిగతావారు కానిస్టేబుళ్లు ఉండాలి. సర్కిల్‌కు ఒక సీఐ ఉండాలి. హోంగార్డులు వీరికి అదనం. అయితే ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల 6 నుంచి 20 మంది కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై మాత్ర మే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిపై పని భారం పెరుగుతోంది. ఫలితంగా కొంతమంది అనారోగ్యంతోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను నిరంతరం రక్షించే పోలీసులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పోలీసుస్టేషన్లలో సరిపడా సిబ్బంది లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. సెలవుల్లోనూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి. దీంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాణాలమీదకు వస్తున్న సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అయితే పెద్దసార్ల దృష్టిలో పడితే అంతే సంగతులు..అంటూ భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది. కుటుంబంతో గడిపే తీరిక లేక, సెలవులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీసు నియామకాలు చేపట్టడంలో ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 వేల మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 1906, మంచిర్యాల జిల్లాలో 1215, నిర్మల్ జిల్లాలో 887, కుమ్రంభీం జిల్లాలో 775 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
బోథ్ సర్కిల్‌లో ఇదీ పరిస్థితి...
బోథ్ సర్కిల్ పరిధిలో బోథ్, బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. బోథ్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు ఉండగా, బజార్ హత్నూర్ మండలంలో ఎస్సై లేకపోవడంతో బోథ్‌లోని రెండో ఎస్సై మొబిన్‌కు బజార్‌హత్నూర్ ఎస్సైగా బాధ్యతలు అప్పజెప్పారు. బోథ్ పోలీస్ స్టేషన్లో ఒక ఏఎస్సై, 16 మంది కానిస్టేబుళ్లు ఉండగా అందులో 10 మంది కానిస్టేబుళ్లు డిప్యుటేషన్, అటాచ్డ్‌గా ఉన్నారు. ప్రస్తుతం కేవలం 6 గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 18 గ్రామపంచాయతీలు ఉన్న నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఆరుగురితో సరిపెట్టుకోవడంతో కానిస్టేబుళ్లపై తీవ్రమైన విధుల ఒత్తిడి ఏర్పడుతోంది. ఇక బజార్‌హత్నూర్ మండల పోలీస్‌స్టేషన్‌లో కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
కానిస్టేబుళ్లపై విరుచుకునడుతున్న పోలీస్‌బాస్‌లు...
విధుల ఒత్తిడి ఒకటైతే.. కొంత మంది పోలీస్ బాస్‌లు కానిస్టేబుళ్లపై పరుషపదజాలం వాడుతుండగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది కలివిడిగా ఉంటే.. మరికొంతమంది బాసిజం ప్రదర్శిస్తున్నారు. వారి ఇంటి అవసరాలకోసం వాడుకోవడం వంటివి కానిస్టేబుళ్లను తీవ్రంగా కుంగదీస్తోంది. నేను చేయను సార్ అంటే చాలు.. కానిస్టేబుళ్లపై విరుచకుపడే సంస్కృతి ఇంకా ఉండటంతో వారు మనోవేదనకు గురవుతున్నారు.
ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది..
⇒ నిత్యం ఎన్నో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే పోలీసులు వారి ఆరోగ్యంపై శ్రద్ధచూపకపోవడంతో అపాయంలో పడుతున్నారు. సాధారణంగా వచ్చే రక్తపోటు, మధుమేహం, గుండె, ఇతర సమస్యలను తగిన సమయంలో గుర్తించలేకపోవడంతో అవి క్రమేపీ తీవ్రమై ఒక్కసారిగా ప్రాణాలను హరించి వేస్తున్నాయి.
⇒ జిల్లాలో అనారోగ్యంతో మృతిచెందిన పోలీసులు కొంతమంది..
⇒ బోథ్ పోలీస్‌స్టేషన్‌లో మూడేళ్ల క్రితం విధులు నిర్వహించిన ఏఎస్సై సుభాష్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
⇒ కెరమెరి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోతీలాల్ సైతం విధుల నిర్వహణలో గుండెపోటుతో మృతిచెందాడు.
⇒ ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుంగన్నకు కూడా అధిక రక్తపోటు రావడం, విధుల నిర్వహణ భారంగా మారడంతో గుండెపోటుతో మరణించారు.
⇒ గతేడాది గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణపతి సైతం గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు.
సిబ్బంది సంక్షేమానికి కృషి
సిబ్బంది సంక్షేమంలో భాగంగా ప్రతివారం ఒక రోజు సెలవు అమలు చేస్తాం. దీంతో పాటు పెళ్లి వేడుకలకు కూడా సిబ్బందికి సెలవులు మంజూరు చేస్తాం. కానిస్టేబుళ్లపై ఎటువంటి ఒత్తిడి పడినివ్వం. త్వరలోనే కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. – కల్మేశ్వర్ సింగెన్‌వార్, ఎస్పీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
కానిస్టేబుళ్లపై ఒత్తిడి పడనివ్వం
అదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో కానిస్టేబుళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి ఉంది. అయితే దీనిని త్వరలోనే అధిగమిస్తాం. పోలీసుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. రాబోయే రోజుల్లో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఏర్పడుతుంది. – వారియర్, ఎస్పీ , అదిలాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment