ఏసీ వల్లనే ఈ సమస్యా?  | Long Term air Conditioning is likely to Cause Health Problems | Sakshi
Sakshi News home page

ఏసీ వల్లనే ఈ సమస్యా? 

Published Wed, Apr 24 2019 1:46 AM | Last Updated on Wed, Apr 24 2019 12:44 PM

Long Term air Conditioning is likely to Cause Health Problems - Sakshi

నా వయసు 36 ఏళ్లు. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్‌ కండిషన్డ్‌ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. 

మీరు చెప్పినట్లుగానే ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... 

తీవ్రమైన అలసట
చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగిన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. 

పొడి చర్మం
సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. 

దీర్ఘకాలిక వ్యాధులు  తీవ్రం కావడం 
కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బీపీ), ఆర్థరైటిస్, న్యూరైటిస్‌ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్‌ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. 

అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం
నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. 

శ్వాస సమస్యలు
చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్‌ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు.  అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. 

ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా? 

నా వయసు 52 ఏళ్లు. కొన్ని ఆర్థిక సమస్యలతో ఇటీవల డబుల్‌షిఫ్ట్‌ డ్యూటీలు చేస్తున్నాను. నా పనిలో భాగంగా అకౌంట్స్‌ అన్నీ  చాలా నిశితంగా చూడాల్సి ఉంటుంది. అందుకోసం చాలా ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా రాకూడదు కాబట్టి చాలా తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. 

అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్‌ షిఫ్ట్‌ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. 

►పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్‌ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది.  

►చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు.

►కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి

►కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్‌ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు

►రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి.

►భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే  రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు.

ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితోనూ బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. 

వేసవిలో వ్యాయామం ఆపేయాలా? 

నేను ఫిబ్రవరిలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు  ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కాబట్టి వ్యాయామం ఆపేయడం మంచిదని కొందరు స్నేహితులు చెబుతున్నారు. దయచేసి నాకు ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. 

వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్‌ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితోపాటు ఖనిజ లవణాలను కోల్పోతుంది.

మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు  చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్‌ సింకోప్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ అసోసియేటెడ్‌ కొలాప్స్‌’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలను నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. 

►ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్‌పోజ్‌ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. 

►చెమటను పీల్చే కాటన్‌దుస్తులను ధరించండి.      

►బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్‌) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.

►మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి.

డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  
కిమ్స్‌ హాస్పిటల్స్,
సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement