పెద్దల్లో నిద్రలేమి సర్వసాధారణమే. వయసు మళ్లిన వారు వివిధ ఆరోగ్య సమస్యల కారణాల వల్ల నిద్రకు దూరమవుతుంటారు. పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, కుంగుబాటు వంటి కారణాల వల్ల యుక్త వయస్కులు కూడా నిద్రకు దూరమవుతుండటం మామూలే. అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఇటీవలి కాలంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
స్థూలకాయానికి ఇదే కారణం...
చదువుల్లో పెరిగిన ఒత్తిడి, టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి వీడియో గేమ్స్‌తో గడిపే అలవాటు, ఒంటికి అలసట కలిగించే ఆటపాటలకు అవకాశం లేకపోవడం వంటి పలు కారణాలు చిన్నారులను నిద్రకు దూరం చేస్తున్నాయి. అవసరమైన సమయం కంటే తక్కువసేపు నిద్రపోయే చిన్నారులు త్వరగా వయసుకు మించి బరువు పెరుగుతున్నారని వర్జీనియా కామన్‌వెల్‌త యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నాలుగు నుంచి పన్నెండేళ్ల లోపు వయసు గల 120 మంది పిల్లలపై నెలల తరబడి నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ బెర్నార్డ్ ఫ్యూమలర్ వెల్లడించారు. పిల్లల్లో స్థూలకాయానికి కొవ్వులతో నిండిన జంక్‌ఫుడ్, తీపి పదార్థాలనే అంతా నిందిస్తారు. చిన్నారులు స్థూలకాయం బారినపడటానికి ఇవి ప్రధాన కారణాలే అయినప్పటికీ నిద్రలేమి కూడా ఇందుకు కారణమవుతోందని ఆయన తెలిపారు. నిద్రలేమికి గురైన పిల్లల్లో జీవక్రియలు మందగిస్తాయని, ఫలితంగా వారు త్వరగా బరువు పెరిగిపోతారని వివరించారు. పిల్లలు వేళకు నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారు తగినంత సమయం నిద్రపోలేకపోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల సహాయం తీసుకోవాలని ప్రొఫెసర్ ఫ్యూమలర్ సూచిస్తున్నారు.
మానసిక సమస్యలకూ మూలం...
నిద్రలేమి కారణంగా స్థూలకాయం, దాని ద్వారా తలెత్తే శారీరక సమస్యలతో పాటు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. తగినంత నిద్రకు దూరమైన చిన్నారుల్లో ప్రవర్తనాపరమైన రుగ్మతలను గుర్తించినట్లు సిన్‌సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లోని న్యూరోసైకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ డీన్ బీబె తెలిపారు. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో దుడుకు ప్రవర్తన, కుదురుగా ఉండలేకపోవడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయని ఆయన చెప్పారు. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడే పిల్లలు ఏకాగ్రత కోల్పోయి, చదువు సంధ్యల్లో వెనుకబడతారని వివరించారు.9
పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే...?
పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిలడెల్ఫియా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని స్లీప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జోడి మిండెల్ ఈ విషయమై చేసిన సూచనలు ఇవీ...
►రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా పిల్లలను ప్రోత్సహించాలి.
►పిల్లలు పడుకునే గదిలో తక్కువ కాంతితో ఉండే లైట్లు వెలిగించాలి.
►పిల్లలు నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఇంట్లోని టీవీలు, కంప్యూటర్ల వంటివి కట్టేయాలి.
►పిల్లలను పడుకోబెట్టి కథలు, కబుర్లు చెబుతూ వారిని నిద్రపుచ్చాలి.
Comments
Please login to add a commentAdd a comment