కలలో పిల్లలు... వాళ్ల నవ్వులు
స్వప్న లిపి
కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి.
కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా?
ఉంది. అదేమిటంటే...
చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు’ స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీక.
కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా.
‘ఫలానా పని నేను చేయలేను’ అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. ్ఞ్ఞ్ఞ్ఞ్ఞనిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి.
‘‘నువ్వు చేయగలవు. ఆ శక్తి నీలో ఉంది’’ అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు.
అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు.
‘‘నేను...లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను’’ అని మనసులో మథనపడుతున్నప్పుడు... ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది.
పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.
‘నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది.