చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు.
సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్‌గార్డ్స్, మౌత్‌పీసెస్‌తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment