Script dream
-
అరెరే... పై నుంచి కింద పడ్డారా!
స్వప్నలిపి దిగ్గున... నిద్రలో నుంచి లేచి కూర్చుంటాం. నుదుటికి పట్టిన చెమటలు ‘కల’ తీవ్రతను తెలియజేస్తాయి. ‘‘హమ్మయ్య...నాకు ఏమీ కాలేదు’’ అనుకోవడం కంటే ఆ కలనే ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. డాబా మీది నుంచో, కొండ మీది నుంచో లేదా ఎత్తై ప్రదేశం నుంచో జారి కిందపడడం అనేది చాలా ఎక్కువమందికి వచ్చే కల. ఈ కలకు సంబంధించిన కొన్ని వివరణలు తెలుసుకుందాం: జీవితం అనేది మనదే అయినప్పటికీ అది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. చేజారిపోతున్న జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నా... ఫలించే ఆశ ఏదీ కనిపించదు. ఇలాంటి పరిస్థితులలో నిరాశానిస్పృహలు చుట్టుముడతాయి. ఈ స్థితిని ప్రతిబించించేదే... చాలా ఎత్తు నుంచి పడి పోతున్నట్లుగా వచ్చే కల.వెనక నుంచి ఎవరో తోస్తే కిందపడిపోయినట్లు కల వస్తుంటుంది కొన్నిసార్లు. నమ్మినవాళ్లు, ఆత్మీయులు అనుకున్నవాళ్ల ఉన్నట్టుండి మోసం చేయడాన్ని లేదా ఇబ్బందులకు గురి చేయడాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది.కొండ చివర వేలాడుతూ, ఏ క్షణాన కింద పడతామో తెలియని భయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు కల రావడం అనేది, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం... ఏదైనా కావచ్చు పరిస్థితుల మీద పట్టు తప్పిన విషయాన్ని సూచిస్తుంది. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం లోపించడం, వ్యక్తిగత సంబంధాల్లో పెను మార్పులు రావడాన్ని సూచిస్తుంది. మీతో పాటు ఎవరైనా కింద పడినట్లు కల వస్తే... ఇద్దరూ ఒకేలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం. జీవితంలో వివిధ సందర్భాల్లో కొన్ని ప్రమాద సంకేతాలు అందుతుంటాయి. జాగ్రత్త పడడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడడం అనేది ఒక విధానం. అలా కాకుండా... ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ఏం చేయాలో తోచని గందరగోళస్థితిలో కూడా చాలా ఎత్తు నుంచి కిందపడబోతున్నట్లు కలలు వస్తుంటాయి. -
కలలో పిల్లలు... వాళ్ల నవ్వులు
స్వప్న లిపి కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి. కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటంటే... చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు’ స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీక. కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా. ‘ఫలానా పని నేను చేయలేను’ అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. ్ఞ్ఞ్ఞ్ఞ్ఞనిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి. ‘‘నువ్వు చేయగలవు. ఆ శక్తి నీలో ఉంది’’ అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు. ‘‘నేను...లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను’’ అని మనసులో మథనపడుతున్నప్పుడు... ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది. పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ‘నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది.