
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు చైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ విద్యార్థి పవన్‌కుమార్ (17)కు వారాంతపు పరీక్షల్లో రెండు మార్లు వరుసగా మార్కులు తక్కువగా వచ్చాయి. మరోసారి ఇలా తక్కువ మార్కులు వస్తే బాగోదని కళాశాల యాజమాన్యం హెచ్చరించింది. మరింత బాగా చదవాలని మరో వైపు తండ్రి ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాతి వారాంతపు పరీక్షకు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈసారి కూడా తక్కువ మార్కులు వస్తాయేమేనని భయపడి గత ఏడాది జూలై 11న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పాఠశాల, కళాశాల విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా ప్రభుత్వం నుంచి వీసమెత్తు చలనం కూడా కనిపించడం లేదు. మూడున్నరేళ్లలో దాదాపు 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా బుధ, గురువారాల్లో మరో ముగ్గురు విద్యార్థులు వేర్వేరు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉండి కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకున్న విద్యార్థులు రోజుకొకరు పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ పరంపరను నిలువరించడానికి ప్రభుత్వం పూనుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది. సంఘటనలు జరిగినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా కమిటీలంటూ హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. నీట్, ఎంసెట్, ఐఐటీ పేరుతో విరామం లేకుండా తరగతులు నిర్వహిస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీలతో పాటు ఇతర కాలేజీల్లోనూ పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం ప్రాణాలు తీసుకుంటుండటం చూస్తుంటే ఆయా విద్యా సంస్థల్లో విపరీతమైన ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. బలవన్మరణాల్లో పోలీసు రికార్డులకు ఎక్కినవి కొన్ని మాత్రమే. విచారకర విషయం ఏమిటంటే తాజాగా పదో తరగతి విద్యార్థులపై కూడా పలు పాఠశాలల్లో విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. 10/10 పాయింట్లు (గ్రేడ్) రావాలని నిర్ధేసిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కమిటీల సిఫార్సులు గాలికి
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు డజనుకుపైగా విచారణ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో దేవుడికే ఎరుక. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో, ప్రొఫెసర్ నీరదారెడ్డి ఆధ్వర్యంలో నియమించిన కమిటీలు పలు విలువైన సూచనలు చేశాయి. ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తున్నాయని, ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లను కొనసాగిస్తున్నాయని నీరదారెడ్డి కమిటీ తేల్చింది. జైళ్ల మాదిరిగా హాస్టళ్లను కొనసాగిస్తుండడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేసింది. వెయిటేజీ కారణంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులు మార్కుల కోసం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపింది. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి డి.చక్రపాణి, శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీ మాజీ వీసీ రత్నకుమారిల నేతృత్వంలో ఏర్పాటైన మరో కమిటీ కూడా పలు సూచనలు చేసింది. అయితే ఏ ఒక్క సూచనా అమలు కావడం లేదు.
ఒత్తిడి తెస్తేనే చర్యలు: విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఏఎన్‌యూలో ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. ఇది తీవ్ర సంచలనానికి దారితీసి రాష్ట్రమంతా అట్టుడికి పోవడం తెలిసిందే. ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్ బాబూరావును రక్షించేలా సర్కారు పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారు. దీంతొ వైఎస్సార్‌సీïపీ సహా ప్రజా సంఘాలన్నీ ఆందోళన ఉధృతం చేయడంతో ప్రభుత్వం చివరకు కేసు నమోదు చేయించింది. మార్కులు, ర్యాంకుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల విషయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు కమిటీలు వేసి ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో విద్యార్థులు నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు.
ఈ కమిటీలు ఏం చెప్పాయంటే..
►ఆదివారాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరాదు
►సాయంత్రం 4 గంటలకల్లా తరగతులు ముగించాలి
►తరగతులు, స్టడీ సమయం తొమ్మిది గంటలకు మించి ఉండరాదు
►ఇంటర్ మార్కులకు వెయిటేజీ తగ్గింటూ వచ్చి.. ఎంసెట్ విధానాన్ని క్రమేణా ఎత్తేయాలి
►శారీరక వ్యాయామానికి వీలుగా ఆటపాటలు ఉండాలి
►విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చి ఇతర గ్రూపుల్లోకి మార్చరాదు
►టీచర్, విద్యార్థు నిష్పత్తి బోర్డు నిబంధనల ప్రకారం ఉండాలి
►టీచర్లు, విద్యార్థులపై పని భారం పెంచరాదు
►ప్రతి ప్రైవేటు కాలేజీలో ఒక కౌన్సెలర్‌ను నియమించాలి
►విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రతి కాలేజీ ప్రత్యేక యాప్ రూపొందించుకోవాలి
►ఈ సూచలన్నీ అమలు చేసేందుకు ఆయా కాలేజీల వారీగా మానటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి
►జిల్లా స్థాయిలో ఎథికల్ కమిటీని నియమించాలి.
‘శ్రీ చైతన్య’లో విద్యార్థిని ఆత్మహత్య
వర్ని(బాన్సువాడ): తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన తోట సంయుక్త (18) హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తోట రాజేందర్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సంయుక్త ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. చదువులో చురుకుగా ఉంటూ అందరితోనూ చలాకీగా ఉండే సంయుక్త బుధవారం రాత్రి కళాశాలలోని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. సంయుక్త తండ్రి బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment