బరంపురం: అభం శుభం ఎరుగని గిరిపుత్రులు పత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో హయిగా బతికే అవకాశం రోజు రోజుకూ సన్నగిల్లుతుంది. ప్రతిక్షణం ఆందోళన, అనుక్షణం ఆవేదనతో గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్ధు అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన గ్రామాలు అట్టుడుకుతున్నాయి. పోలీసులు, మావోయిస్టులు తమకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ‘ఏ జన్మలో ఏ పాపం చేసామో.. ఇప్పుడిలా నరకం అనుభవిస్తున్నా’మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొందమాల్ జిల్లాను ఆనుకొని మావోయిస్టుల బృందం నయగడా జిల్లా అటవీశాఖ కార్యలయంలో చొరబడి.. ఆయుధాలు దోచుకున్నారు. అలాగే 18న కొందమాల్ జిల్లాలో జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్‌కి కొద్ది గంటల ముందు పిరింగియాలో అధికారుల వాహనాలను పేల్చివేశారు. ఈ ఘటన నుంచి కోలుకునే లోపే అదే రోజు సాయంత్రం గచ్చపడా పోలీసు స్టేషన్ పరిధిలోని బోరలా గ్రామంలో పోలింగ్ సూపర్ వైజర్‌గా ఉన్న సంజుక్త దిగల్‌ను తుపాకీతో కాల్చిచంపారు.
పక్కా సమాచారంతో!
మావోయిస్టుల వరుస ఘటనలతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొందమాల్, గజపతి, గంజాం జిల్లాల సరిహద్ధులు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక గిరిజనులు భయంతో తల్లడిల్లి పోతున్నారు. కొందమాల్ జిల్లా దరింగబడి బ్లాక్ బమ్మునిగాం పోలీస్ స్టేషన్ పరిధి తిరుబడి అటవీ ప్రాంతం, గంజాం జిల్లా సరిహద్ధు మోహన, గుమ్మ, గంజాం–కొందమాల్ జిల్లా సరిహద్ధులైన ముజగర్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతమైన గస్మా అరణ్య ప్రాంతాల్లో ఛతీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో బీహార్‌కు చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు తిష్ట వేసి, ప్లీనరీలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొద్ది రోజుల క్రితం దక్షణాంచల్ ఐజీ జితేంద్రకోయల్ ఆదేశాలతో గంజాం ఎస్పీ బ్రాజేష్‌కుమార్ రాయ్, కొందమాల్ ఎస్పీ ప్రతీక్‌సింగ్ సంయుక్తంగా నిర్వసిస్తున్న ఈ కూంబింగ్‌లో సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ, కోబ్రా కమాండర్లు మావోయిస్టులను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందమాల్ జిల్లా గిరిజనులను సాక్షి ప్రతినిధి కలిశారు. వారి కన్నీటి వెతలకు అక్షర రూపమే ఈ ప్రత్యేక ‘సాక్షి’ కథనం...
గంజాం, కొందమాల్ జిల్లాల్లో
తిరుబడి, గస్మా, ముజగర్ పానిగొండా అటవీ ప్రాంతం గంజాం, కొందమాల్ జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం 4 ఫారెస్ట్ అరణ్య ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. నక్సలైట్లు అరణ్య ప్రాంతాల్లో ప్లినరీలు నిర్వహిస్తున్న సమాచారంతో గతవారం నుంచి పోలీసులు, సీఆర్‌పీ బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో దరింగబడి, తిరుబడి, కిటింగియా, రైకియా, దసింగియా, పనిగొండా, మోహన, గుమ్మా, ముజగర్, గస్మా ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు భయంతో వణుకుతున్నారు. కొనసాగుతున్న కూంబింగ్ వల్ల ఈ భయం మరింత పెరిగిపోయింది. ఇలా సరిహద్ధుల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కొందమాల్ జిల్లాలో దట్టమైన ప్రాంతాలైన దరింగబడి బ్లాక్ తిరుబడి, గస్మా, ముజగర్‌కు మెల్లమెల్లగా బలగాలు చేరుతూ... మావోయిస్టులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో పోలీసులు ఏజెన్సీ కేంద్రాల్లో కట్టుదిట్టంగా కూంబింగ్ చేయాలని ఉన్నతాధికార్లు అదేశించినట్లు తెలిస్తుంది.
మావోయిస్టులపై పోలీస్‌లు ముప్పేట దాడులు జరిపే సమయం లేదన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాని దుర్గంగా మార్చుకున్న విధంగా గత 2 ఏళ్లుగా కొందమాల్ జిల్లాని కూడా మావోయిస్టులు అక్రమించుకొని, దాడులు జరిపి.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఒకవైపు కొనసాగుతున్న కూంబింగ్‌తో మరోవైపు రక్షిత జోన్‌లలో తలదాచుకుంటున్న మావోయిస్టుల అగ్రనాయకులు పోలీసు వ్యూహాలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య యుద్ధ పాతిపదక వాతావరణంలో మార్పులు తీసుకు రావల్సి వచ్చింది.
అల్లాడుతున్న గరిపుత్రులు
గంజాం, కొందమాల్ జిల్లా పరిధిలోని కటింగియా, పాణిగొండా, తిరుబడి, దాసింగి, మోనా, అడవా గిరిజన ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే గరిపుత్రులు బతుకే నరకంగా భావిస్తున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని భయపడుతూ జీవిస్తున్నారు. గ్రామాలు దాటి బయటికి వస్తే తరిగి క్షేమంగా ఇంటికి వేళ్లలేమనే భయంతో ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వారం రోజులుగా ఇక్కడ గిరిజన గ్రామాల్లో గిరిపుత్రుల పరిస్థతి దయానీయంగా ఉంది. పోలీసులు ఇప్పటికే తిరుబడి గిరిజనుల ఇళ్లకు వచ్చి మావోయిస్టుల ఆచూకీ కోసం పదే పదే వేధిస్తున్నారని చెబుతున్నారు. తమకు ఏమీ తెలియదన్నా వినడం లేదని, తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆదివాసీలు తమ అవేదని వ్యక్తం చేస్తున్నారు.
దాడులు ఎక్కువయ్యాయి
కొందమాల్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. వారికి పటున్న ప్రాంతాల్లో విజయం సాధించడం కష్టమే. ఏ సమయంలోనూ ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేయలేం. మరోవైపు మావోస్టుల దాడులు, పోలీసుల కూంబింగ్ వల్ల గిరిజనులు ఎక్కువగా నష్టపోతున్నారు. శాంతి చర్చలు ఏర్పాటు చేసి, అమాయక గిరిపుత్రులకు ప్రాణభయం లేకుండా చర్యలు చేపట్టాలి.
– లంబొదర్ కార్, కుయి సమాజ్ అధ్యక్షుడు
క్షణ క్షణం.. భయం భయం
పోలీసులు రక్షిస్తారని భావించడం ఎప్పుడో మానేశాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడి గూడేల సమీపంలోనే ఉన్నారంటూ పోలీసులు మమ్మల్ని వేధించడం నిత్య కృత్యమైంది. మేమంతా ఇక్కడ ఉండటమే నేరంలా చూస్తున్నారు. రెండువైపులా ఇబ్బందులతో ప్రత్యక్ష నకరం చూస్తున్నాం.
– మరియా ధిగల్, గిరిజనురాలు, తిరుబడి
ప్రభుత్వ తీరే కారణం
మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడానికి కారణం ప్రభుత్వం పనితీరే. వారికి, పోలీసులకు పరస్పర కాల్పుల వల్ల గిరిజనులు నలిగి పోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. పాలకుల నిర్లక్ష్యం వల్లే పోలీసులు, నక్సలైట్ల లోనూ పోరుబాట పెరిగింది. ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్ పరిణామాలు మరింత వ్యధను మిగిల్చేవిగా ఉంటుందని ఆందోళనగా ఉంది.
ప్రపుల్ల సమంతరాయ్, లోక్‌శక్తి అభియాన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment