telugu sahithyam
-
తెలుగు–ఒడియా అనువాద వారధి
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు. ‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) – పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు -
కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’
తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది. అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు. ‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది. ‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. ‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్’ (హిందీ అనువాదం), ఇన్నర్ విజన్ (ఇంగ్లిష్ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్ అనువాదం ‘విండ్స్ ఆర్ అలైవ్’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి. – పన్యాల జగన్నాథ దాసు, సీనియర్ జర్నలిస్ట్ -
డైలీ దౌడ్
ఎవరో కుర్రవాడు రన్నింగ్ రేస్ చేస్తున్నవాడిలా పేవ్మెంట్ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు. అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్‌స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి. తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ. అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో! ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించ లేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు. తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. బాప్రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడు వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు? అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్‌వాలాలాగా పేవ్మెంట్ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్ అలవాటయింది. స్కూల్ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది. ఆ రోజు... అంతర్ జిల్లా ఎథ్లెటిక్స్ ముగింపు రోజు. రన్నింగ్ ఫైనల్స్. ట్రాక్ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ద స్టేట్’ అని సావనీర్లో ఫొటో కింద వ్రాశారు.రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి. స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’ రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు. ‘‘గూడ్. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’ ‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’ ‘‘గూడ్. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’ రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు. ‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్ ఆఫ్ కన్వేయన్స్. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’ రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు. ‘‘గూడ్– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’ ‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’ ‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’ లీవ్ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’. ‘‘చెప్పండి సార్’’ ‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు. రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్ ఎ ఫేమస్ రన్నర్ వన్స్’’ అని స్ప్రింగ్ డోర్ మూసి యివతలికి వచ్చాడు. ∙∙ ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్ రన్’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు. ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి. ‘‘రన్... రన్ మై డియర్బాయ్ రన్...’’ -
అయితే పెద్దమనిషివే!
మద్రాస్ అసెంబ్లీలో ఏదో చర్చ నడుస్తోంది. జస్టిస్ పార్టీకి చెందిన పానుగంటి రామరాయనింగార్ మాట్లాడుతున్నారు. ఆయన గతంలో తీసుకున్న వైఖరికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి గ్రహించారు. సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడిగా పేరొందిన కట్టమంచి అప్పటికి జస్టిస్ పార్టీ వీడి స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు. ‘ఆర్యా, గతంలో రామరాయనింగార్ గారు ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడారు, ఇప్పుడు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన వైఖరిని తెలియజేసే ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి’ అని తన జేబులో చేయి పెట్టబోయారు కట్టమంచి. ‘ప్రేమికులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఏవో లేఖలు రాసుకుంటారు. ఏదైనా కారణం వల్ల ఆ బంధం విడిపోతే, ఎవరి లేఖలు వాళ్లకు ఇచ్చుకోవడం, పాతవాటిని స్మరించకుండా ఉండటం పెద్ద మనుషుల మర్యాద’ అని పెద్ద మనిషి అన్నమాటను నొక్కారు రామరాయనింగార్. ఇంక దాని మీద కొనసాగించకుండా కూర్చుండిపోయారు కట్టమంచి, పెద్దమనిషిలా! (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అంతర్జాలం
రేపు ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’పై జాతీయ సదస్సు l బొమ్మూరు సాహిత్యపీఠం, మనోజ్ఞ అకాడమీల నిర్వహణ ∙ వివిధ రాష్ట్రాల నుంచి రానున్న పరిశోధకులు, ప్రొఫెసర్లు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘చిన్నతనంలో వీధి బడులలో పలకలు పట్టుకుని చదువుకున్నాం. నేడు విద్యార్థులు లాప్‌టాప్‌లతో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే తరాలు కంప్యూటర్ పరిజ్ఞానంతో తెలుగుభాషా సాహిత్యాలను స్వర్ణయుగంలోకి తీసుకు వెళ్లాలి. ఈ లక్ష్యంతోనే ఈనెల 11న బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠంలో మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీతో కలసి ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నాం’ అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఈ విషయంపై ‘సాక్షి’తో ప్రత్యేకం ఫోనులో మాట్లాడారు..వివరాలు ఆయన మాటల్లోనే... రాతియుగంనుంచి అంతర్జాలయుగంలోకి ప్రవేశించిన ఉజ్వలయుగంలో నేడు మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతర్జాలం వేదికపై కలుసుకుంటున్నారు. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ళ పైబడ్డ చరిత్ర ఉంది. అద్దంకి శాసనంనుంచి అంతర్జాల సాహిత్యం వరకు తెలుగు వాజ్ఞ్మయం వివిధ ధోరణులకు, పరిణామాలకు గురి అయింది. తెలుగు ఎంఏలో అంతర్జాలం ఒక పాఠ్యాంశంగా మారింది. కంప్యూటర్ను ధారణాయంత్రమని అంటున్నాం. మిగతా భాషల కన్నా, సాహిత్యానికి సంబంధించినంతవరకు అంతర్జాల వినియోగంలో బెంగాలీ, హిందీ, తెలుగు భాషలు ముందున్నాయి. రాబోయే తరాల కోసం ఈ సదస్సు ఒక దశను, దిశను నిర్ధారిస్తుంది. ఒక్క క్లిక్‌తో విశ్వసాహిత్యం నేటికీ అంతర్జాలం అనే పదం చాలామందికి పరిచయం లేదు. ఇంటర్నెట్ అంటేనే వారికి తెలుస్తుంది’ అన్నారు జాతీయ సదస్సులో భాగస్వామి అయిన మనోజ్ఞ సాంస్కృతిక అకాడమీ వ్యవస్థాపకురాలు డాక్టర్ పుట్ల హేమలత. 11న జరిగే సదస్సులో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలు భాగస్వాములే. 11వ తేదీన జరగనున్న జాతీయ సదస్సుగురించి పుట్ల హేమలత విశ్లేషణ.. ‘అంతర్జాలం ద్వారా అద్భుతమైన సాహిత్యానికి దగ్గర కావచ్చునని నేటి యువత తెలుసుకోవాలి. గతంలో ఒక పుస్తకం కావలసి వస్తే వెతుకులాట తప్పేది కాదు. నేడు ఒక క్లిక్‌తో ఏ దేశసాహిత్యమైనా చదువుకునే సౌలభ్యం ఏర్పడింది. మన భాషను ఇతర భాషలలోకి తీసుకువెళ్ళడానికి అంతర్జాలం ఉపయోగపడుతోంది. విద్యార్థులు ఫేస్ బుక్‌లకు, ఛాటింగులకు పరిమితం కారాదు. పద్యరచనకు ఛందోనియమాలను తెలిపే సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. మీరు తప్పురాస్తే అది చూపుతుంది. పుస్తకాలు చదువుకోవడంలో ఉన్న సౌలభ్యం అంతర్జాలాన్ని ఉపయోగించడంలో లేదని అంటున్నారు. కానీ, జనరేష¯ŒS గ్యాప్‌ను మనం అర్థం చేసుకోవాలి. నేటి యువతరం ఉద్యోగం చేస్తూ, విరామసమయాల్లో సోషల్ సైట్లలోకి వెళ్ళి సాహిత్య చర్చల్లో పాల్గొంటున్నారు. మొదటఆసక్తి చూపని నిన్నటి తరం కూడా నేడు ఆసక్తి చూపుతోంది. ఇది మంచి పరిణామమే.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు అంతర్జాలంలో తెలుగు టైపింగ్‌కు యూనికోడ్ మాత్రమే ఉపయోగపడుతోంది. అందులో కొన్ని అక్షరాలకోసం చాలా కష్టపడవలసి వస్తోంది. ఉదాహరణకు ‘ఠ’. ఇటీవల ప్రభుత్వం 18 రకా ల ఫాంట్లను విడుదల చే యడంతో పరిస్థితి కాస్తమెరుగయింది. అయిదు అంశాలపై సదస్సులు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, బెనారస్ హిందు విశ్వవిద్యాలయంనుంచి సుమారు 150 మంది పరిశోధకులు, ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ సదస్సుకు డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహిస్తారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ, విజయనగరం ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రత్యేక అధికారి ఆచార్య జి.యోహా¯ŒSబాబు తదితరులు పాల్గొంటారు. 11 గంటలకు ‘తెలుగు భాష–సాంకేతిక పరిజ్ఞానం–ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సుకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. బెంగళూరుకు చెందిన కవి, డిజిటల్ ప్లానెట్ ఎం.డి. డాక్టర్ ఇక్బాల్ చంద్ ‘డయస్పోరా సాహిత్యం–వెబ్సైట్లు–బ్లాగులు’ అనే అంశంపై జరిగే సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. భోజన విరామానంతరం ‘విహం గ’ అంతర్జాల మహిళాపత్రిక వార్షికోత్సవం జరుగు తుంది. అనంతరం ‘సోషల్ నెట్ వర్కింగ్‌సైట్లు–సాహిత్య చర్చలు’ అనే అంశంపై మూడో సదస్సు, ‘అంతర్జాలంలో తెలుగు పత్రికల కృషి’ అనే అంశంపై నాలుగో సదస్సు, ‘అంతర్జాలంలో బాల సాహిత్యం’ అనే అంశంపై అయిదో సదస్సు జరుగుతాయి. సమాపనోత్సవంలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, కొలకలూరి ఆశాజ్యోతి, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.