తెలుగులోనూ ప్రశ్నపత్రం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహిస్తున్న రాతపరీక్షల్లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాన్ని తెలుగులోనూ ఇస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పేపర్‌ను ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇంగ్లిష్‌లో ఇచ్చే ప్రశ్నపత్రానికి పక్కనే తెలుగు అనువాదం ఇస్తామన్నారు.
జవాబులు రాసేప్పుడు తెలుగులోగానీ, ఇంగ్లిష్‌లోగానీ ప్రశ్నలను చూసి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, రెండింటిలో ఏదో ఒక దానిని అభ్యర్థులు ఎంచుకోవాలని సూచించారు. మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పేపర్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు.
పరీక్షకు పక్కా ఏర్పాట్లు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లో 99 కేంద్రాల్లో నిర్వహించే ‘ఏఈఈ’ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు పార్వతీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపడుతోందని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు మందుగానే చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 గంటల మధ్యలోనే, మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 మధ్యలోనే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సిబ్బంది, 250 మందిని అబ్జర్వర్లను, తనిఖీల కోసం 29 స్పెషల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్
ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న జనరల్ స్టడీస్ పరీక్ష పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పరిపాలనా ట్రిబ్యునల్‌కు టీఎస్‌పీఎస్సీ నివేదించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు ట్రిబ్యునల్‌కు హామీ ఇచ్చారు. ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్‌లో జనరల్ స్టడీస్ పేపర్‌ను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రాసుకోవచ్చని ప్రకటించిందని, తర్వాత ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌లోనే ఇవ్వాలని నిర్ణయించిందని..
ఇది సరికాదంటూ ఆదిలాబాద్‌కు చెందిన చైతన్య, మరికొందరు అభ్యర్థులు శుక్రవారం పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్‌పీఎస్సీ హామీ ఇవ్వడంతో పిటిషన్‌పై విచారణను ట్రిబ్యునల్ ముగించింది.