Assistant Executive Engineer
-
లంచం కేసులో ఇంజినీర్‌కు ఏడాది జైలు
చెన్నై: దాదాపు పదమూడు సంవత్సరాల కింద లంచం తీసుకున్న కేసులో ఓ ఇంజినీర్‌కు ఏడాది జైలు శిక్ష విదించారు. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ ఉధగమండలం సమీపంలోని కూనూరులో 2003 సమయంలో విధులు నిర్వహించాడు. అయితే ఆ సమయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ ఓ వ్యక్తి వద్ద రూ.1000 లంచం తీసుకున్నాడు. ఈ కేసు బుధవారం విచారణకు రాగా, సబ్ కోర్ట్ జడ్జి ఎం.తంగవేలు కేసుపై విచారణ జరిపి లంచం తీసుకున్నట్లు గుర్తించారు. ఓ ఇంటికి నూతన విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇంటి యజమాని, కాంట్రాక్టర్ల నుంచి వెయ్యి రూపాయలు తీసుకున్నట్లు ఇంజినీర్ కూడా అంగీకరించాడు. అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. లంచం తీసుకున్న ఇంజినీర్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సబ్ కోర్ట్ జడ్జి తంగవేలు తీర్పు వెల్లడించారు. -
30న ఏఈఈ పోస్టుల ఇంటర్వ్యూలు
జనవరిలో మిగతా పోస్టులకు.. టీఎస్పీఎస్సీ ప్రకటన హైదరాబాద్: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం బీసీ క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) మెకానికల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించి, వ్యవసాయ అధికారి పోస్టులకు మినహా మిగిలిన అన్నిరకాల పోస్టులకు జనవరిలో ఇంటర్వ్యూలను పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగంలో ఏఈఈ మెకానికల్ పోస్టులకు 30న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ సోమవారం తెలిపారు. 32 మందితో కూడిన మెరిట్ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. 30న ఉదయం 9కు కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్లు, చెక్‌లిస్ట్‌లు, ఇతర ఫారాలను ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత నుంచి తమ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటని వెరిఫికేషన్ సమయంలో అంద జేయాలని చెప్పారు. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను (అటెస్టెడ్) అందజేయాలని సూచించారు. -
తెలుగులోనూ ప్రశ్నపత్రం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహిస్తున్న రాతపరీక్షల్లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాన్ని తెలుగులోనూ ఇస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పేపర్‌ను ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇంగ్లిష్‌లో ఇచ్చే ప్రశ్నపత్రానికి పక్కనే తెలుగు అనువాదం ఇస్తామన్నారు. జవాబులు రాసేప్పుడు తెలుగులోగానీ, ఇంగ్లిష్‌లోగానీ ప్రశ్నలను చూసి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, రెండింటిలో ఏదో ఒక దానిని అభ్యర్థులు ఎంచుకోవాలని సూచించారు. మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పేపర్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. పరీక్షకు పక్కా ఏర్పాట్లు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లో 99 కేంద్రాల్లో నిర్వహించే ‘ఏఈఈ’ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు పార్వతీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపడుతోందని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు మందుగానే చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 గంటల మధ్యలోనే, మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 మధ్యలోనే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సిబ్బంది, 250 మందిని అబ్జర్వర్లను, తనిఖీల కోసం 29 స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్ ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న జనరల్ స్టడీస్ పరీక్ష పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పరిపాలనా ట్రిబ్యునల్‌కు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు ట్రిబ్యునల్‌కు హామీ ఇచ్చారు. ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్ పేపర్‌ను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రాసుకోవచ్చని ప్రకటించిందని, తర్వాత ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌లోనే ఇవ్వాలని నిర్ణయించిందని.. ఇది సరికాదంటూ ఆదిలాబాద్‌కు చెందిన చైతన్య, మరికొందరు అభ్యర్థులు శుక్రవారం పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ హామీ ఇవ్వడంతో పిటిషన్‌పై విచారణను ట్రిబ్యునల్ ముగించింది. -
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
-
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులే ఆన్లైన్లో మాక్ టెస్టు ద్వారా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేక లింకును ఇచ్చింది. మంగళవారమే ఈ లింకును అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష సమయంలో ఇబ్బందులు పడకుండా, ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్ టెస్టులో కూడా అవన్నీ ఉంటాయని తెలిపారు. పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి.. బహుళ ఐశ్చిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలి.. అన్న నిబంధనలు ఇందులో ఉంటాయని వివరించారు. ఇందులో ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే అభ్యర్థులు హాల్‌టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, తద్వారా పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పరీక్ష మొత్తం ఇంగ్లిషు మీడియంలోనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం పరీక్ష కోసం అభ్యర్థులు 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా ఉండాలని తెలిపారు.