లంచం కేసులో ఇంజినీర్‌కు ఏడాది జైలు
చెన్నై: దాదాపు పదమూడు సంవత్సరాల కింద లంచం తీసుకున్న కేసులో ఓ ఇంజినీర్‌కు ఏడాది జైలు శిక్ష విదించారు. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ ఉధగమండలం సమీపంలోని కూనూరులో 2003 సమయంలో విధులు నిర్వహించాడు. అయితే ఆ సమయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ ఓ వ్యక్తి వద్ద రూ.1000 లంచం తీసుకున్నాడు. ఈ కేసు బుధవారం విచారణకు రాగా, సబ్ కోర్ట్ జడ్జి ఎం.తంగవేలు కేసుపై విచారణ జరిపి లంచం తీసుకున్నట్లు గుర్తించారు.
ఓ ఇంటికి నూతన విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇంటి యజమాని, కాంట్రాక్టర్ల నుంచి వెయ్యి రూపాయలు తీసుకున్నట్లు ఇంజినీర్ కూడా అంగీకరించాడు. అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. లంచం తీసుకున్న ఇంజినీర్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సబ్ కోర్ట్ జడ్జి తంగవేలు తీర్పు వెల్లడించారు.