30న ఏఈఈ పోస్టుల ఇంటర్వ్యూలు
జనవరిలో మిగతా పోస్టులకు..
టీఎస్‌పీఎస్సీ ప్రకటన
హైదరాబాద్: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం బీసీ క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) మెకానికల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించి, వ్యవసాయ అధికారి పోస్టులకు మినహా మిగిలిన అన్నిరకాల పోస్టులకు జనవరిలో ఇంటర్వ్యూలను పూర్తి చేసేందుకు సమాయత్తమైంది.
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగంలో ఏఈఈ మెకానికల్ పోస్టులకు 30న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ సోమవారం తెలిపారు. 32 మందితో కూడిన మెరిట్ జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. 30న ఉదయం 9కు కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్లు, చెక్‌లిస్ట్‌లు, ఇతర ఫారాలను ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత నుంచి తమ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటని వెరిఫికేషన్ సమయంలో అంద జేయాలని చెప్పారు. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను (అటెస్టెడ్) అందజేయాలని సూచించారు.