సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులే ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు ద్వారా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేక లింకును ఇచ్చింది. మంగళవారమే ఈ లింకును అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్‌టీ) నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష సమయంలో ఇబ్బందులు పడకుండా, ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.
ఆన్‌లైన్ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్ టెస్టులో కూడా అవన్నీ ఉంటాయని తెలిపారు. పాస్‌వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి.. బహుళ ఐశ్చిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలి.. అన్న నిబంధనలు ఇందులో ఉంటాయని వివరించారు. ఇందులో ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే అభ్యర్థులు హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, తద్వారా పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పరీక్ష మొత్తం ఇంగ్లిషు మీడియంలోనే ఉంటుందని తెలిపారు.
20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం పరీక్ష కోసం అభ్యర్థులు 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా ఉండాలని తెలిపారు.
‘ఏఈఈ’ ఆన్‌లైన్ మాక్ టెస్టు
Published Wed, Sep 16 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM
Advertisement
Advertisement