గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు రెండో రోజూ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు శివారు వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆన్‌లైన్ మాక్ ఎంసెట్ అగ్రికల్చర్ కంప్యూటర్ పరీక్షను నిర్వహించారు. వివిధ జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఏపీఈఏపీ సెట్ ఆన్‌లైన్ పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ప్రశ్నల సరళి కూడా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌కు దగ్గరగా ఏపీఈఏపీ సెట్ తరహాలో ఇచ్చారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను పూరించడంతోపాటు తమలోని సబ్జెక్టు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏ స్థాయిలో ర్యాంకు సాధించగలమో తెలుసుకునేందుకు ఈ టెస్టు ఉపయోగపడిందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే విధానాలపై అవగాహన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీఈఏపీసెట్ ఎలా జరుగుతుందోనన్న అనుమానాలు పటాపంచలయ్యాయని సంతోషంగా చెప్పారు. సాక్షి మీడియా గ్రూపునకు కృతజ్ఞతలు తెలిపారు.
సిలబస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి
మాక్ ఎంసెట్ అగ్రి కల్చర్ టెస్టులో బైపీసీ విభాగం నుంచి అధికంగా మేము చదివిన అంశాల నుంచి ప్రశ్నలు ఉన్నాయి. మాక్ టెస్టు కేవలం ప్రాక్టీసు కోసమే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏపీఈఏపీ సెట్‌కు హాజరయ్యేందుకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ‘సాక్షి’ కృషి ఎంతో బాగుంది.
– పి.కావ్యశ్రీ, విద్యార్థిని
ఆన్‌లైన్ టెస్ట్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి
ఆన్‌లైన్‌లో పరీక్షకు హాజరు కావడం ఇదే తొలిసారి. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్‌లైన్ నిర్వహణ ఎంతో బాగుంది. ఏపీఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు సాధించడంలో మాక్‌టెస్టు ఒక ప్రాక్టీసులా ఉపయోగపడింది. ఈ సెట్‌తోపాటు నీట్ పరీక్షకు హాజరు కానున్నాను.
– షేక్ షాయిస్తా, విద్యార్థిని
ఆన్‌లైన్ టెస్టుపై ఆందోళన తొలగింది
ఆన్‌లైన్ టెస్టుపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడంతో కొంచెం ఆందోళనగా ఉండేది. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్‌లైన్ టెస్టుతో ఆ టెన్షన్ మాయమైంది. ఈ పరీక్షతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది మంచి ప్రాక్టీసు పరీక్షలా ఉపయోగడుతుంది. థాంక్యూ ‘సాక్షి’
– పి.సరయు, విద్యార్థిని
ప్రశ్నల సరళి భేష్
‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం జరిపే ఏపీ ఈఏపీ సెట్‌ను తలపించాయి. కచ్చితమైన సమయాన్ని కేటాయించడంతోపాటు సమయపాలన పాటించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కాలేజీలో లెక్చరర్లు చెప్పిన అంశాలు వీటిలో ఉన్నాయి. చాలా బాగుంది.
– పి.గిరిజ, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment