ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’! | APPSC Assistant Professor Candidates Meet Governor | Sakshi
Sakshi News home page

ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’!

Published Sun, Apr 22 2018 1:29 PM | Last Updated on Sun, Apr 22 2018 4:23 PM

APPSC Assistant Professor Candidates Meet Governor - Sakshi

గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రీసెర్చ్‌ స్కాలర్స్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, తదితరులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: యూజీసీ నిబంధనలు, రోస్టర్‌ పాయింట్లు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల ఆందోళన ఉధృతమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించగా మరికొంతమంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమయ్యారు.

అసంబద్ధ పద్ధతి అంటున్న అభ్యర్థులు
రాష్ట్రంలో మొత్తం 13 యూనివర్సిటీల్లో 1190 ఖాళీలకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గతంలో వర్సిటీల్లో నియామకాలన్నీ యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ విధానంలో జరిగేవి. అయితే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చూసిన అభ్యర్థులు.. ఆన్‌లైన్‌ ద్వారా అధ్యాపకులను ఎంపిక చేయడాన్ని అసంబద్ధమైన పద్ధతిగా తేల్చిచెబుతున్నారు. అనేక తప్పుల తడకలతో, సిలబస్‌ను అతిక్రమించి ప్రశ్నపత్రాన్ని  క్లిష్టంగా రూపొందించారని అంటున్నారు.

భాషా సబ్జెక్టుల అభ్యర్థులకు తీవ్రనష్టం
ఆన్‌లైన్‌ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు తమిళం, కన్నడం భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి పేపర్‌కు సంబంధించి ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లిష్‌తోపాటు మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. తెలుగు సహాయ ఆచార్యుడి ఉద్యోగానికి ఆంగ్లంలో పరీక్ష నిర్వహించడమేమిటన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో కూడా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తుంటే ఇక్కడ ఒక్క ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఇవ్వడంతో తాము నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. లైఫ్‌ సైన్సెస్‌కు జరిగిన స్క్రీనింగ్‌ టెస్టులో సుమారు పది సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్‌ సైన్సెస్‌ తదితర)లకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ సబ్జెక్టుకు అనుగుణంగా ఆయా సబ్జెక్టు ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా, అన్నింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశ్నపత్రం రూపకల్పన సరిగా లేదు
సాధారణంగా 50 నుంచి 60 శాతం ప్రశ్నలను అందరూ రాసే విధంగా, మిగిలిన 40 శాతం ప్రశ్నలను కొంత కఠినంగా ఇస్తుంటారు. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రం సివిల్స్‌ ప్రశ్నపత్రం కంటే కఠినంగా, కేవలం వడపోతే లక్ష్యంగా ఉన్నట్టు ఉంది. అదేవిధంగా పరీక్షలకు కనీసం 40 రోజుల గడువును ఇవ్వాలనే విషయాన్ని మరిచి పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా మాక్‌ టెస్ట్‌లు నిర్వహించలేదు.
–డాక్టర్‌ ఎం.వి. మణివర్మ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఏయూ

లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ
నెగెటివ్‌ మార్కులు పెట్టడంతో అధిక శాతం మంది అర్హత సాధించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌ పరీక్షకు సైతం నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లాయి. వీటికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. పరీక్ష నిర్వహణ మొత్తం లోపభూయిష్టంగా ఉంది.
–ఆరేటి మహేశ్, పరిశోధకులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం

పరీక్ష రద్దు చేయాలని గవర్నర్‌కు వినతి
ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డాక్టరేట్స్, రీసెర్చ్‌ స్కాలర్స్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌ శనివారం గవర్నర్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖ విచ్చేసిన గవర్నర్‌ను శనివారం సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ నిరంకుశంగా పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement