roster points
-
అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు. అధ్యాపక నియామకాలు ప్రారంభించండి కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్ చాన్స్లర్లకు సూచించింది. -
ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: యూజీసీ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల ఆందోళన ఉధృతమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించగా మరికొంతమంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. అసంబద్ధ పద్ధతి అంటున్న అభ్యర్థులు రాష్ట్రంలో మొత్తం 13 యూనివర్సిటీల్లో 1190 ఖాళీలకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో వర్సిటీల్లో నియామకాలన్నీ యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ విధానంలో జరిగేవి. అయితే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చూసిన అభ్యర్థులు.. ఆన్లైన్ ద్వారా అధ్యాపకులను ఎంపిక చేయడాన్ని అసంబద్ధమైన పద్ధతిగా తేల్చిచెబుతున్నారు. అనేక తప్పుల తడకలతో, సిలబస్‌ను అతిక్రమించి ప్రశ్నపత్రాన్ని క్లిష్టంగా రూపొందించారని అంటున్నారు. భాషా సబ్జెక్టుల అభ్యర్థులకు తీవ్రనష్టం ఆన్లైన్ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు తమిళం, కన్నడం భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి పేపర్‌కు సంబంధించి ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లిష్‌తోపాటు మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. తెలుగు సహాయ ఆచార్యుడి ఉద్యోగానికి ఆంగ్లంలో పరీక్ష నిర్వహించడమేమిటన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో కూడా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తుంటే ఇక్కడ ఒక్క ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఇవ్వడంతో తాము నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. లైఫ్ సైన్సెస్‌కు జరిగిన స్క్రీనింగ్ టెస్టులో సుమారు పది సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్ సైన్సెస్ తదితర)లకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ సబ్జెక్టుకు అనుగుణంగా ఆయా సబ్జెక్టు ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా, అన్నింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం రూపకల్పన సరిగా లేదు సాధారణంగా 50 నుంచి 60 శాతం ప్రశ్నలను అందరూ రాసే విధంగా, మిగిలిన 40 శాతం ప్రశ్నలను కొంత కఠినంగా ఇస్తుంటారు. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రం సివిల్స్ ప్రశ్నపత్రం కంటే కఠినంగా, కేవలం వడపోతే లక్ష్యంగా ఉన్నట్టు ఉంది. అదేవిధంగా పరీక్షలకు కనీసం 40 రోజుల గడువును ఇవ్వాలనే విషయాన్ని మరిచి పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా మాక్ టెస్ట్‌లు నిర్వహించలేదు. –డాక్టర్ ఎం.వి. మణివర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏయూ లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ నెగెటివ్ మార్కులు పెట్టడంతో అధిక శాతం మంది అర్హత సాధించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షకు సైతం నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లాయి. వీటికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. పరీక్ష నిర్వహణ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. –ఆరేటి మహేశ్, పరిశోధకులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పరీక్ష రద్దు చేయాలని గవర్నర్‌కు వినతి ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డాక్టరేట్స్, రీసెర్చ్ స్కాలర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ శనివారం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖ విచ్చేసిన గవర్నర్‌ను శనివారం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ నిరంకుశంగా పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
మనోడే... పదోన్నతి ఇచ్చేయ్!
మార్కెటింగ్ శాఖల్లో ప్రమోషన్ల వివాదం రోస్టర్ పాయింట్లు, సీనియారిటీ జాబితాలు లేవు డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లకు అందలం మాతృసంస్థ ఉద్యోగులకు అన్యాయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 14 ఏళ్లుగా మాతృసంస్థలో సేవలు అందిస్తున్న సివిల్ ఇంజినీర్లను కాదని మూడేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై వచ్చిన మెకానికల్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించేం దుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖలో పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ శాఖలో డొంకరోడ్ల మరమ్మతులు, గోడౌన్ల నిర్మాణాలకు సివిల్ ఇంజినీర్లు అవసరం కావడంతో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వారిని నియమించింది. వీరు కొనసాగుతుండగానే మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎంఈఎల్) నుంచి బీటెక్ చేసిన 12 మంది మెకానికల్ ఇంజినీర్లు(అసిస్టెంట్ ఇంజినీర్లుగా) డిప్యూటేషన్‌పై వచ్చి, ఆ తరువాత మార్కెటింగ్ శాఖలో విలీనమయ్యారు. ఈ విభాగంలో ఇప్పటివరకూ సీని యారిటీ, రోస్టర్ పాయింట్ల నిర్వహణ సక్రమంగా లేదు. డిప్యూటేషన్‌పై వచ్చిన వారిలో ఇద్దరు వ్యక్తులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి పొందేందుకు మంత్రి దేవినేని ఉమాకు సన్నిహితంగా ఉంటున్న పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ ఇద్దరికి ప్రమోషన్లు ఇవ్వాలంటూ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఇక సీనియారిటీ ప్రకారం పదోన్నతి పొందాల్సిన ఇద్దరు ఇంజనీర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగ సంఘాలను ఆశ్రయించారు. తాము 14 ఏళ్లుగా మాతృసంస్థలో పనిచేస్తున్నామని, సర్వీసు రికార్డుల్లో ఎక్కడా రిమార్కులు లేవని మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇచ్చిన లేఖలో తెలిపారు. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తే ఇతర ఇంజినీరింగ్ సిబ్బందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది ‘‘పదోన్నతుల ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మాతృసంస్థ నుంచి ఇద్దరు, డిప్యూటేషన్‌పై వచ్చి విలీనమైన ఇద్దరు ఇంజనీర్లు పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు. ట్రాక్ రికార్డు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపాను. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ – మల్లికార్జునరావు, మార్కెటింగ్ శాఖ కమిషనర్