మనోడే... పదోన్నతి ఇచ్చేయ్!
మార్కెటింగ్ శాఖల్లో ప్రమోషన్ల వివాదం
రోస్టర్ పాయింట్లు, సీనియారిటీ జాబితాలు లేవు
డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లకు అందలం
మాతృసంస్థ ఉద్యోగులకు అన్యాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 14 ఏళ్లుగా మాతృసంస్థలో సేవలు అందిస్తున్న సివిల్ ఇంజినీర్లను కాదని మూడేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై వచ్చిన మెకానికల్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించేం దుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెటింగ్ శాఖలో పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ శాఖలో డొంకరోడ్ల మరమ్మతులు, గోడౌన్ల నిర్మాణాలకు సివిల్ ఇంజినీర్లు అవసరం కావడంతో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వారిని నియమించింది. వీరు కొనసాగుతుండగానే మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎంఈఎల్) నుంచి బీటెక్ చేసిన 12 మంది మెకానికల్ ఇంజినీర్లు(అసిస్టెంట్ ఇంజినీర్లుగా) డిప్యూటేషన్‌పై వచ్చి, ఆ తరువాత మార్కెటింగ్ శాఖలో విలీనమయ్యారు. ఈ విభాగంలో ఇప్పటివరకూ సీని యారిటీ, రోస్టర్ పాయింట్ల నిర్వహణ సక్రమంగా లేదు.
డిప్యూటేషన్‌పై వచ్చిన వారిలో ఇద్దరు వ్యక్తులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి పొందేందుకు మంత్రి దేవినేని ఉమాకు సన్నిహితంగా ఉంటున్న పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ ఇద్దరికి ప్రమోషన్లు ఇవ్వాలంటూ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఇక సీనియారిటీ ప్రకారం పదోన్నతి పొందాల్సిన ఇద్దరు ఇంజనీర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగ సంఘాలను ఆశ్రయించారు. తాము 14 ఏళ్లుగా మాతృసంస్థలో పనిచేస్తున్నామని, సర్వీసు రికార్డుల్లో ఎక్కడా రిమార్కులు లేవని మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇచ్చిన లేఖలో తెలిపారు. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తే ఇతర ఇంజినీరింగ్ సిబ్బందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది
‘‘పదోన్నతుల ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మాతృసంస్థ నుంచి ఇద్దరు, డిప్యూటేషన్‌పై వచ్చి విలీనమైన ఇద్దరు ఇంజనీర్లు పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు. ట్రాక్ రికార్డు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపాను. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’
– మల్లికార్జునరావు, మార్కెటింగ్ శాఖ కమిషనర్