సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఎవరైనా ప్రమోషన్లు వదులుకోరు. ఒకసారి కాకపోయినా రెండో సారైనా మిస్ చేసుకోరు. కానీ జీహెచ్‌ఎంసీలో చిత్రమేమిటో కానీ ఎంటమాలజీ (దోమల నివారణ)విభాగంలోని సీనియర్ అధికారులు తమకు ప్రమోషన్ వద్దంటూ ఇక్కడే తిష్టవేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్టులుగా పనిచేస్తున్న ముగ్గురికి గత డిసెంబర్‌లో జిల్లా మలేరియా అధికారులుగా (డీఎంఓ) ప్రమోషన్లు ఇస్తూ..జిల్లాలకు వెళ్లమంటే ఇక్కడే ఉంటాం తమకు ప్రమోషన్లు వద్దన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రమోషన్లు పొందితే మున్ముందు మరింత ఉన్నత స్థానాలకు వెళతారు. ప్రమోషన్లు కావాలని కోరుకుంటారు. అదేం చిత్రమో కానీ జీహెచ్‌ఎంసీలోని సీనియర్ ఎంటమాలజిస్టులు మాత్రం వద్దన్నారు. ఉన్న ఎస్‌ఈ హోదాతోనే కొనసాగుతామంటూ ఉండిపోయారు. ఒకరు మూడేళ్లుగా ఇక్కడే ఉండగా, మరొకరు దాదాపు దశాబ్దకాలంగా ఇక్కడే ఉన్నారు. దశాబ్దకాలంగా ఉన్నఅధికారి రెండో పర్యాయం కూడా ప్రమోషన్ వద్దన్నట్లు తెలిసింది. బహుశా ఇక సర్వీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం లేకున్నా బల్దియాలోనే ఉండేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఉత్తుత్తి బదిలీ.. ?
మరొకరు ప్రమోషన్ తీసుకొని రంగారెడ్డి జిల్లా డీఎంఓగా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, విధులు మాత్రం నిర్వహించలేదు. డీఎంఓ పోస్టుతో ఒక్కరోజు కూడా విధులు నిర్వహించకుండానే పైరవీలతో తిరిగి జీహెచ్‌ఎంసీలోనే ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ మీద చేరినట్లు తెలిసింది. బదిలీ కావడానికి ముందు బల్దియాలో పనిచేసింది కూడా ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ మీదనే కావడం విశేషం. బదిలీ అయి, జాయినైన రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ అక్కడ కాకుండా బల్దియాకే తిరిగి రావడం వెనుక మతలబు ఏమిటో అంతు పట్టడం లేదు. అంతేకాదు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండే బల్దియా ఎల్‌బీనగర్ జోన్‌లో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ముగ్గురు అధికారుల్లో ఒకరు సర్వీసుకాలం మొత్తం మీద ఇక ప్రమోషనే వద్దనుకోవడం.. మరొకరు పేరుకు బదిలీ అయినా వెంటనే వెనక్కు రావడం, ఇంకొకరు సైతం ఇక్కడే ఉంటాననడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎందుకో..?
జీహెచ్‌ఎంసీ వర్గాల నుంచే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, బల్దియాలో ఎంటమాలజీ విభాగం అంటేనే అవినీతి కార్యకలాపాల పుట్ట అనే పేరుంది. దోమల నివారణలో భాగంగా వినియోగించే పెట్రోలు, కిరోసిన్/డీజిల్‌ల నుంచి పైరిథ్రిమ్ దాకా లెక్కాపక్కా లేకుండా ఖర్చుచేసే వీలుంటుంది. ఫాగింగ్, డ్రోన్‌ల పేరిట జరిగే కార్యక్రమాలది మరో తంతు. అత్యవసరాల పేరిట ఔట్‌సోర్సింగ్‌పై తీసుకునే సిబ్బంది నియామకాల్లో డబ్బులు చేతులు మారతాయి. ఇటీవల కరోనా తీవ్రత నేపథ్యంలో దాదాపు 200 మందిని తీసుకున్నారు. వీటికోసం భవిష్యత్‌లో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయంటూ ఒక్కొక్కరి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా అవినీతేనని బల్దియా ఎంటమాలజీ విభాగంపై అవగాహన కొందరు పేర్కొన్నారు. అందువల్లే బదిలీ అయినప్పటికీ సీనియర్ ఎంటమాలజిస్టులు ఎక్కడకూ వెళ్లడం లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శాశ్వతంగా పాగా..?
తాము ప్రమోషన్ పొందకుండా బల్దియాలోనే ఉన్నా, తమను ఇక్కడినుంచి కదిలించే వారు ఇక ఉండరనే ధీమాలో సీనియర్ ఎంటమాలజిస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్ ఎంటమాలజిస్టులుగా పదోన్నతులు పొందేందుకు దిగువస్థాయిలో అర్హులు ఎవరూ లేనందునే వారికీ ధీమా అంటున్నారు. పదోన్నతులు పొందేవారుంటే వారిని వీరిస్థానాల్లో నియమించి, వీరిని బదిలీ చేసేందుకు వీలుండేది. అలాంటి పరిస్థితి లేనందువల్లే ఇక ఎవరూ రారనే ధీమాతోనే శాశ్వతంగా బల్దియాలో పాగా వేసేందుకే ప్రమోషన్లు వదులకున్నారని, పైరవీలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు, బదిలీల సందర్భంగా వారి పేరెంట్ విభాగం నుంచి రిమార్కులు తీసుకోవాల్సి ఉన్నా, తీసుకోకుండానే వీరిని బల్దియాలోనే కొనసాగించేందుకు పైరవీలు చేశారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment