నీకింత..నాకింత!
అంగన్వాడీ పోస్టుల భర్తీలో టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి
కార్యకర్త పోస్టుకు రూ.1.50 లక్షలు.. ఆయా పోస్టుకు రూ.40 వేలు
అభ్యర్థులను తీసుకువచ్చిన ‘తమ్ముళ్ల’కు 20 శాతం వరకు కమీషన్
మిగిలిన సొమ్మును నొక్కేసి పోస్టులు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
మొత్తం 758 మంది వరకూ నియామకం ..
చేతులు మారిన సొమ్ము రూ. నాలుగు కోట్లకుపై మాటే ..
బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఉద్యోగాలు పొందుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ప్రకటన అర్థంకాని వారు అమాయకులుగా, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అదెలాగంటే...ఇటీవల జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీలో ఇది నిజమైంది. కాకపోతే నిబం‘ధనం’ వర్తించింది. తమ్ముళ్లు దళారులుగా వ్యవహరించగా, సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే పోస్టులు అమ్ముకుని వచ్చిన కోట్ల రూపాయలను ‘నీకింత నాకింత’ అనే రీతిలో పంచుకున్నట్టు తెలుస్తోంది....!
గుంటూరు: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల నియామకంలో భారీ ఎత్తున సొమ్ము చేతులు మారింది. ‘తిలాపాపం-తలాపిడికెడు’ అనే రీతిలో పాలకులు ఈ సొమ్మును వాటాలు వేసుకున్నారు. గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలు ఈ పోస్టుల నియామకానికి డబ్బులు ఇచ్చే అభ్యర్థులను గుర్తించి వారిని టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు తీసుకువచ్చి రేటు నిర్ణయించారు. ఈ మొత్తంలో సింహభాగం ఎమ్మెల్యేలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. ఇలా రూ.4 కోట్లకుపైగానే సొమ్ము చేతులు మారినట్టు ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 192 అంగన్వాడీ కార్యకర్తలు, 566 మంది అంగన్వాడీ సహాయకుల (ఆయాలు)పోస్టులను గత నెలలో భర్తీ చేశారు. వీటి ద్వారా లభించిన మొత్తాన్ని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వాటాలు వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీకి సేవ చేసిన నాయకుల సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తే వారినే నియమించారు.
అంగన్వాడీ కార్యకర్తల భర్తీ : జిల్లాలో 219 అంగన్వాడీ పోస్టుల భర్తీకి అక్టోబరు 6 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. వీటిలో 192 పోస్టులను భర్తీ చేశారు. 20 శాతం అంటే 38 పోస్టులు రాజకీయ సిఫారసులకు వదిలేస్తే, మిగిలిన 154 పోస్టులకు ధర నిర్ణయించి అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యేలు సొమ్ములు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు సగటును రూ.1.50 లక్షలు చొప్పున దాదాపు రూ.2.31 కోట్లు చేతులు మారాయి. ఈ మొత్తంలో అభ్యర్థులను తీసుకువచ్చిన కార్యకర్తలకు సుమారు 20 శాతం కమిషన్(రూ.46 లక్షలు)గా ఇచ్చి మిగిలిన మొత్తాన్ని (రూ.1.85 కోట్లు) ఎమ్మెల్యేలు తీసుకున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి.
అంగన్వాడీ సహాయకుల భర్తీ ...
అంగన్వాడీ సహాయకుల (ఆయాలు) పోస్టుల భర్తీని కూడా ఎమ్మెల్యేలు వదిలిపెట్టలేదు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేశారని, ఇందులో రూ.10 వేలు అభ్యర్థిని తీసుకువచ్చిన కార్యకర్తకు ఇచ్చి మిగిలిన రూ. 30 వేలను ఎమ్మెల్యేలు తీసుకు న్నారని చెబుతున్నారు. జిల్లాలో 913 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి 566 మందిని ఎంపిక చేశారు. వీటికి సంబంధించి రూ.2.26 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది.
ఎంపిక ప్రక్రియ ...
గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇంటర్వ్యూలు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో జరిగాయి. నరసరావుపేట డివిజన్ ఇంటర్వ్యూలు నరసరావుపేటలోని ఆర్డీవో కార్యాలయం, గురజాల డివిజన్ ఇంటర్వ్యూలు గురజాలలో జరిగాయి. ఇంటర్వ్యూల్లో డివిజన్ ఆర్డీవోతోపాటు స్త్రీ, శిశు మహిళా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ప్రాజెక్టు పరిధిలోని సీడీపీఓలు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకే వారు పరిమితం అయ్యారు. మిగిలిన కార్యక్రమం అంతా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పూర్తి చేశారు.
పార్టీ కార్యకర్తల నుంచీ వసూలు ...
చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో నాయకులు ప్రచారం చేశారు. దీంతో అనేక గ్రామాల్లోని మహిళా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. బాబు వస్తే ఈ తరహా ఉద్యోగాలు వస్తాయని వీరంతా భావి ంచారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్బు ఇస్తేనే ఉద్యోగం అంటూ నాయకులు కొత్త పాటపాడటంతో మహిళా కార్యకర్తలు బిత్తరపోయారు. వచ్చిన ఈ అవకాశాన్ని కొందరు మహిళా కార్యకర్తలు సద్వినియోగం చేసుకునేందుకు మెడల్లోని పుస్తేలు, బంగారు ఆభరణాలను తెగనమ్మేసి ఉద్యోగాలు కొనుక్కున్నారు. ఈ మొత్తాలు చెల్లించలేని మహిళా కార్యకర్తలు నాయకులు, ఎమ్మె ల్యేలను ప్రాధేయపడినా ఉపయోగం లేకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
భర్తీ వివరాలు ....
జిల్లాలో 219 అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి 857 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వారిలో 192 మంది ఎంపికయ్యారు. 27 ప్రాంతాల్లో అభ్యర్థులు లేకపోవడం, ఒక్కొక్కరే ఇంటర్వ్యూకు హాజరుకావడంతో వాటిని భర్తీ చేయలేదు. 913 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు 1061 మంది హాజరుకాగా 566 మందిని ఎంపిక చేశారు. 347 పోస్టులను వివిధ కారణాల తో భర్తీ చేయలేదు. మినీ అంగన్ వాడీ కేంద్రాల్లోని 4 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ముగ్గురు ఎంపికయ్యారు.