విద్యుత్ ఏఈ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు డిస్కంల నుంచి 1,427 ఏఈ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు రావాల్సి ఉండగా.. గురవారం ట్రాన్స్‌కోలో 206, జెన్‌కోలో 856, ఎన్పీడీసీఎల్‌లో 164 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, వెంకట నారాయణ నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆయా కేటగిరీల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్ల వరకు సడలించారు. జెన్‌కో పోస్టులకు అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
రాత పరీక్ష నవంబర్ 14న జరగనుంది. ట్రాన్స్‌కో ఏఈ పోస్టుల కోసం అక్టోబర్ 6 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 29న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 201 ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఒకటి రెండు రోజుల్లో నియామక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది.
ఓపెన్ కేటగిరీ పోస్టులూ తెలంగాణ అభ్యర్థులకే..
ఓపెన్ కేటగిరీ పోస్టులను తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. లోకల్ కేటగిరీ పోస్టులకు సంబంధిత జోన్ పరిధిలోని జిల్లాల అభ్యర్థులే అర్హులు కాగా.. ఓపెన్ కేటగిరీ పోస్టులకు జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్లు
జెన్‌కో: www.genco.telangana.gov.in, http://tsgenco.cgg.gov.in
ట్రాన్స్‌కో: ww.transco.telangana.gov.in, http://tstransco.cgg.gov.in
ఎన్పీడీసీఎల్: www.tsnpdcl.in