గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. నోటిఫికేషన్‌ ఎప్పుడంటే? | AP Grama ward sachivalayam Notification, Exam Process Details | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. ఈ సారి పరీక్షలు ఎలా అంటే..

Published Sun, Jan 22 2023 5:00 AM | Last Updated on Sun, Jan 22 2023 10:58 AM

AP Grama ward sachivalayam Notification, Exam Process Details - Sakshi

సాక్షి, అమరావతి:  గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్‌ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది.

అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్‌ (ఓఎమ్మార్‌ షీట్‌– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది.  

మూడో విడతలో పలు మార్పులు   
– గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు.  
– తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్‌ – 2 వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు.

– ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్,  మహిళా పోలీసు, గ్రేడ్‌ – 2 వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు.  

8 లక్షల దరఖాస్తులు అంచనా.. 
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు.  
– మొదటి విడత నోటిఫికేషన్‌లో గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.  
– 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

– ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
– మూడో విడత ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు çపరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్‌ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు.  

ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌.. 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖతో పాటు వి­విధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి.  కేటగిరీల వా­రీ­గా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖ­లు రోస్టర్‌– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరా­లకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గా­లు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్ర­వరిలో నోటిఫికేషన్‌ జారీకి అన్ని ఏర్పా­ట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement