సచివాలయాల ఉద్యోగులకు ‘ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌’  | Different indicators as per category wise jobchart | Sakshi
Sakshi News home page

సచివాలయాల ఉద్యోగులకు ‘ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌’ 

Published Thu, Jan 26 2023 4:01 AM | Last Updated on Thu, Jan 26 2023 4:01 AM

Different indicators as per category wise jobchart - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పని తీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ (ఉద్యోగి పనితీరు సూచికలు)ను రూపొందిస్తోంది. సచివాలయాల్లో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్‌చార్ట్‌ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ ఉంటాయి.

ఈ ఇండికేటర్స్‌ ఆధారంగా మండల స్థాయి అధికారులు ప్రతి నెలా వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. సంతృప్తికరం (గుడ్‌), తృప్తికరం (ఫెయిర్‌), పర్వాలేదు (శాటిస్ఫై),  అసంతృప్తికరం (నాట్‌ శాటిస్ఫై)గా రేటింగ్‌ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్‌ పొందే ఉద్యోగులకు మెళకువలు పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.  

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు పనితీరు అంచనా 
వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల జాబ్‌ నోటిఫికేషన్‌లలోనే ఉద్యోగుల పని తీరు నిరంతర అంచనా అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జాబ్‌ చార్ట్‌లను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఇటీవల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉద్దేశించిన కొన్ని సుస్థిర అభివృద్ధి సూచికలు (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌)ను రూపొందించుకొని ఆ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన సచివాలయాల ఉద్యోగులకు  కూడా ఈ సుస్థిర అభివృద్ధి సూచికల ప్రకారం పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ను రూపొందిస్తోంది. వీటి రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఆయా ఉద్యోగుల విధులకు సంబంధించిన శాఖలకే అప్పగించింది. ఇప్పటివరకు ఆరు శాఖలు పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ను రూపొందించి, ఉత్తర్వులు కూడా జారీ చేశాయి.

పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు పశు సంవర్ధక శాఖ, మహిళా పోలీసు ఉద్యోగులకు హోం శాఖ, ఏఎన్‌ఎంలకు వైద్య, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆరు కేటగిరీల ఉద్యోగులకు పట్టణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ రూపొందించాయి. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

వీరందరికీ వారి జాబ్‌ చార్ట్‌ ప్రకారం వంద మార్కులు ఉంటాయి. పని తీరు ఆధారంగా మార్కులు వేస్తారు. డిజిటల్‌ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా రేటింగ్‌ ఇచ్చారు. 90కిపైగా మార్కులు తెచ్చుకొనే డిజిటల్‌ అసిస్టెంట్లకు ఎక్సలెంట్‌ రేటింగ్‌ ఇస్తారు. 75 – 90 మార్కులు వచ్చేవారికి గుడ్‌ రేటింగ్, 50 – 75 మధ్య మార్కులు వచ్చేవారికి ఫెయిర్,  50 మార్కులకు కన్నా తక్కువ తెచ్చుకునే వారికి పూర్‌ రేటింగ్‌ ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మిగిలిన శాఖలు కూడా త్వరలో ఇండికేటర్స్‌ రూపొందిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement