పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌ | Online Test For Corporate Company Director Post | Sakshi
Sakshi News home page

పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

Jun 13 2019 8:59 AM | Updated on Jun 13 2019 8:59 AM

Online Test For Corporate Company Director Post - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పరిపాలనను పారదర్శకంగా మార్చేందుకు, కార్పొరేట్‌ కంపెనీల్లో అక్రమాలు, మోసాలకు చెక్‌ పెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కారు త్వరలోనే చర్యలు చేపట్టనుంది. దేశ కార్పొరేట్‌ రంగంలో గతేడాది ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో విఫలం కావడం లిక్విడిటీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ గ్రూపు ప్రమోటర్ల మోసాలు ఒక్కొక్కటీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఏకంగా రూ.13,000 కోట్లకుపైగా మోసగించాడు. ఇవన్నీ చూశాక... కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలను కేంద్రం మరింత కఠినతరం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా చేరాలనుకునే వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్ష పాస్‌ కావాల్సి ఉంటుందని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఖాతాల్లో అక్రమాల సమాచారాన్ని రిపోర్ట్‌ చేయనందుకు, ఆ కంపెనీకి ఆడిటింగ్‌ సేవలందించిన డెలాయిట్‌ హస్కిన్స్, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని ఇప్పటికే కార్పొరేట్‌ శాఖ ఎన్‌సీఎల్‌టీ ముందు పిటిషన్‌ కూడా దాఖలు చేసిన విషయం గమనార్హం. కంపెనీల్లో మోసాలు, సంక్షోభాలకు సంబంధించిన సంకేతాలను అవి బయటపడటానికి ముందే బోర్డుల్లో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లు గుర్తించగలరనేది పరిశీలకుల భావన. ‘‘ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు ఎటువంటి ధర్మకర్త బాధ్యతలు లేవన్న అపోహను తొలగించాలనుకుంటున్నాం. కార్పొరేట్‌ విషయాల గురించి తెలియజేయడంతోపాటు, తమ విధులు, పాత్ర, బాధ్యతల గురించి వారిలో అవగాహన ఉండేలా చేయనున్నాం’’ అని ఇంజేటి శ్రీనివాస్‌ ఈ సందర్భంగా వివరించారు. 

ఆన్‌లైన్లో పరీక్ష...
‘‘భారతీయ కంపెనీల చట్టం, విలువలు, క్యాపిటల్‌ మార్కెట్‌ నిబంధనలు తదితర అంశాలను పరీక్షించేలా ఆన్‌లైన్‌ మదింపు ఉంటుంది. డైరెక్టర్లు కావాలనే ఆసక్తి ఉన్న వారు నిర్ణీత కాలవ్యవధిలోపు పరీక్షను పాస్‌ కావాల్సి ఉంటుంది. పరిమితి లేకుండా ఒకరు ఎన్ని సార్లయినా పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం’’ అని శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా సేవలందిస్తున్న అనుభవజ్ఞులకు మాత్రం ఆన్‌లైన్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. అయితే, అటువంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే డేటాబేస్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు, ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు ఇది వారధిగా ఉంటుందని, ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల కోసం చూసే కంపెనీలు తమతో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారిని ఈ వేదికగా కలుసుకోవచ్చని శ్రీనివాస్‌ తెలిపారు.   

స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై ప్రశ్నలు
కంపెనీల చట్టం ప్రకారం ప్రతీ లిస్టెడ్‌ కంపెనీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను బోర్డులో నియమించుకోవాల్సి ఉంటుంది. బోర్డు మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట ఒక వంతు వీరు ఉండాలి. ఆయా కంపెనీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించడంతో పాటు, మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షకులుగా వ్యవహరించడమనేది వీరి బాధ్యత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement