TGPSC: నేడు, రేపు గ్రూప్‌-3 పరీక్షలు.. సెంటర్ల వద్ద సెక్షన్‌ 144 విధింపు | TGPSC Conducted Gruop-3 Exams From Nov 17th And 18th | Sakshi
Sakshi News home page

TGPSC: నేడు, రేపు గ్రూప్‌-3 పరీక్షలు.. సెంటర్ల వద్ద సెక్షన్‌ 144 విధింపు

Published Sun, Nov 17 2024 7:11 AM | Last Updated on Sun, Nov 17 2024 7:38 AM

TGPSC Conducted Gruop-3 Exams From Nov 17th And 18th

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–1.. అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న(రేపు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–3 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. 

గ్రూప్‌-3 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ అయింది.

గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి 
గ్రూప్‌–3 అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తామని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసింది. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్‌ హాల్‌టికెట్లను జారీ చేయబోమని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement