రేపటి నుంచే గ్రూప్‌–3 పరీక్షలు! | TSPSC Group 3 Exam 2024 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే గ్రూప్‌–3 పరీక్షలు!

Published Sat, Nov 16 2024 10:11 AM | Last Updated on Sat, Nov 16 2024 10:11 AM

TSPSC Group 3 Exam 2024

రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ 

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ 

పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, నిఘా ఏర్పాట్లు చేసిన యంత్రాంగం 

మొత్తం పోస్టులు 1,388.. హాజరుకానున్న అభ్యర్థులు 5.36 లక్షలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రోజు రెండు, రెండో రోజు ఒక పరీక్ష నిర్వహించనున్నారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–1.. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు. 

18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–3 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్‌–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ అయింది. 

కలెక్టర్లు, ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు.. 
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు, ఎస్పీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. టీజీపీఎస్సీ కార్యాలయానికి వాటిని అనుసంధానించి.. ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. 

గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి 
గ్రూప్‌–3 అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తామని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసింది. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్‌ హాల్‌టికెట్లను జారీ చేయబోమని పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement