సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. నిన్నటి(శనివారం)నిరసనల ఎఫెక్ట్‌తో అశోక్‌నగర్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఆందోళనకు బీజేపీ,బీఆర్‌ఎస్ పార్టీలు మద్దతు పలికాయి.
మరోవైపు, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?
గ్రూప్–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment