ప్రశాంతంగా గ్రూప్–3 పరీక్ష
– జిల్లా వ్యప్తంగా 136 కేంద్రాల్లో నిర్వహణ
– పరీక్షకు 34,191 మంది హాజరు
– 14,717 మంది అభ్యర్థుల గైర్హాజరు
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్–3 (పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–4) పరీక్ష ‘అనంత’లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 136 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 69.91 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
జిల్లావ్యాప్తంగా 34,191 మంది అభ్యర్థులు హాజరు కాగా, 14,717 మంది గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నలుగురు అభ్యర్థులు నిర్ధేశించిన సమయం దాటిన తరువాత వచ్చారు. వారిని పరీక్షకు అనుమతించలేదు. తమ ఆలస్యానికి కారణాన్ని ఇన్‌చార్జి జేసీకి అభ్యర్థులు చెప్పుకున్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అనుమతించడం కుదరదని వారికి ఇన్‌చార్జి జేసీ చెప్పారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి వెనక్కి పంపించారు.