అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు | groups notifications in october, says ganta chakrapani | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు

Published Sun, Aug 23 2015 5:16 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

groups notifications in october, says ganta chakrapani

 ‘సాక్షి’ భవిత సదస్సులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
  4 నెలల్లో 10 నోటిఫికేషన్లు.. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ
  ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకూ అందరికీ ఉద్యోగాలని వెల్లడి
  ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సుకు భారీగా అభ్యర్థుల రాక
  కిక్కిరిసిపోయిన త్యాగరాయ గానసభ ప్రాంగణం..
  రహదారుల పక్కన స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ప్రదర్శన
  అప్పటికప్పుడు నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు ఏర్పాటు
  రెండు చోట్లా అభ్యర్థులకు అవగాహన కల్పించిన నిపుణులు

 
 సాక్షి, హైదరాబాద్:
 రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలతో ముందుకువెళుతున్నామని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. గ్రూప్ పరీక్షలకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు తన మాటలనే ప్రకటనగా భావించవచ్చని పేర్కొన్నారు. ‘సాక్షి భవిత’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ, నగర కేంద్ర గ్రంథాలయంలో ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది. ఊహించినదానికంటే ఈ సదస్సుకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వేల సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో త్యాగరాయ గానసభ కిక్కిరిసిపోయి, బయట కూడా నిలబడిపోయారు. ఆ వీధులన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. దీంతో బయట ఉన్న వారి సౌకర్యార్థం భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

అభ్యర్థులు ఇంకా వస్తుండడంతో అప్పటిక ప్పుడు ఇక్కడి నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ రెండు చోట్లా ఏకకాలంలో సదస్సు కొనసాగింది. వక్తలు ఒకచోట ప్రసంగించిన తర్వాత.. మరో వేదిక వద్దకు నడిచి వెళ్లి ప్రసంగించారు. అభ్యర్థులు నిపుణులు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నారు. సిలబస్, పరీక్షా విధానంపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సుకు ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
 
 పారదర్శకంగా నియామకాలు
 పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఘంటా చక్రపాణి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘‘కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొలితరం ఉద్యోగులు మీరే. ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా కష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని సాధించండి. ఉద్యోగ అభ్యర్థుల కోసం ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వంటి వాటిని సద్వినియోగం చేసుకోండి. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు జరుగుతాయి. నాకుగానీ, మా సభ్యులకు కానీ  ఎలాంటి సొంత ప్రయోజనాలు లేవు. అందరూ  విద్యావంతులు, ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నవాళ్లే..’’ అని చక్రపాణి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇప్పుడున్నట్లుగా గ్రూప్-1, గ్రూప్-2 విభజన ఉండ బోదని, సివిల్స్ తరహాలో ఒకేవిధంగా తెలంగాణ సివిల్ సర్వీస్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆ పరీక్షల్లో పొందిన మార్కులకు అనుగుణంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మరో వారంలో గ్రూప్-1, 2 సిలబస్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే అభ్యర్థులు సిలబస్‌పై స్పష్టత కోరుతున్నారని, ఏ పుస్తకాలు చదవాలో అడుగుతున్నారన్నారు. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను మాత్రమే రూపొందిస్తుందని, ఎలాంటి పుస్తకాలో చదవాలో చెప్పదని స్పష్టం చేశారు. అభ్యర్థులు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని సూచించారు.
 
 వాయిదా వేసే ప్రసక్తే లేదు
 పరీక్షల నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని చక్రపాణి పేర్కొన్నారు. అటువంటి ఆలోచనను దరిచేరనీయవద్దని, పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘‘తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఉంటే... 6 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు సగటున వంద మంది పోటీపడుతున్నారు. అయినా అధైర్యం వద్దు. కష్టపడి చదివిన వారికి ఫలితం తప్పకుండా దక్కుతుంది. విద్యార్థులు ఏ రంగంలో చదువుకున్నారో.. ఆ రంగంలోని ఉద్యోగాలకు పోటీపడితే మంచిది. తమ సబ్జెక్టులో ఉన్న ప్రతిభకు నైపుణ్యాలు సంపాదిస్తే ఉద్యోగం సులువుగా సంపాదించవచ్చు. ఉద్యోగంలో త్వరగా స్థిరపడవచ్చు. అలా కాకపోతే మిగిలిన ఉద్యోగాలకు అనవసర పోటీ పెరుగుతోంది. ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ పెట్టాలన్న అంశంపై 30 మంది మేధావులతో చర్చించాం. పాలకులకు మాత్రమే విజన్ ఉంటే సరిపోదు.. అధికారులకూ ఉండాలి. ఉద్యోగం అనేది మిమ్మల్ని పోషించుకోవడానికి కాదు, రాష్ట్రానికి సేవ చేయడానికి ఇచ్చిన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. అంకితభావం, చొరవ, స్పష్టత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీపై ఉంది. కమిషన్‌పై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పుట్టిన ప్రాంతాన్ని అడగడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం కోసమే నోటిఫికేషన్ వేశారని, ఆంధ్రవాళ్లకు అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారు. అవును.. తెలంగాణ ప్రాంత సమాజం కోసమే టీఎస్‌పీఎస్సీ ఉంది. రాజ్యాంగం మాకు ఆ హక్కు కల్పించింది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిభ ఉంటే నిబంధనల ప్రకారం ఉద్యోగాలు దక్కుతాయి..’’ అని
 వ్యాఖ్యానించారు.
 
 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు..
 
 గతంలో లేనివిధంగా అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించబోతున్నట్లు చక్రపాణి చెప్పారు. ‘‘రాబోయే 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు బిల్ కలెక్టర్, డిగ్రీ విద్యార్థులకు హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్‌స్పెక్టర్... ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ తది తర బ్రాంచ్‌లు చేసిన విద్యార్థులకూ నోటిఫికేషన్‌లో స్థానం కల్పిస్తాం. హైదరాబాద్‌లో 250 బిల్ కలెక్టర్ పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్, గెజిటెడ్ పోస్టులలో అభ్యర్థుల విషయ పరి జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపై పట్టు తదితర అంశాలపై వారి సామర్థ్యాన్ని బేరీజు వేయడానికి ఇంట ర్వ్యూ తప్పనిసరి.,’’ అని పేర్కొన్నారు.
 
 సీరియస్‌గా సిద్ధమైతే విజయం మీదే
 ‘‘పోటీ పరీక్షల్లో తెలంగాణ ఆర్థిక, సామాజిక అంశాలు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన ‘ది ఇన్వెంటింగ్ తెలంగాణ-సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ -2014’ పుస్తకం విద్యార్థులకు ఎంతో దోహదం చేస్తుంది. సీరియస్‌గా సన్నద్ధమైతే విజయం వరిస్తుంది..’’ఆటుపోట్లు ఎదురైతే నిరాశ చెందొద్దు. ఒక్కదారి మూసుకుంటే మరో దారి ఉందన్న ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
     - ప్రొఫెసర్ కోదండరామ్
 
 
  త్వరలోనే సిలబస్
 ‘‘తెలంగాణ ఉద్యమ క్రమం, సాయుధ పోరాటం, ముల్కీ, నాన్ ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం.. తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. ఇందుకు సంబంధించి ప్రొఫెసర్లతో కలసి సమగ్ర సిలబస్ రూపొందించాం. త్వరలోనే పుస్తక రూపంలో అభ్యర్థుల ముంగిటకు రానుంది. తెలంగాణ ప్రాంతం వాళ్లే పేపర్ వాల్యూయేషన్ చేస్తారు’’
 - వి.ప్రకాశ్, ప్రొఫెసర్ జయశంకర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు
 
 నైపుణ్యమే వరం
 
 ‘‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యమే వరం.. అది లేకుంటే భారమే. గైడ్ విధానాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ విధానం ద్వారా అభ్యర్థులు సహజసిద్ధ ఆలోచనలు చేయడం లేదు. సృజనాత్మకత పెంపొందడం లేదు. కోర్ సబ్జెక్టులపై విద్యార్థులు దృష్టి సారించాలి. ఇంటర్వ్యూ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’
 - విద్యావేత్త చుక్కా రామయ్య
 
 రెండు లక్షల ఉద్యోగాల భర్తీ: నాయిని
 
  తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఖాళీల వివరాలు రాగానే ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో దశల వారీగా రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని నాయిని చెప్పా రు. ఉద్యోగా ర్ధులం తా ఏకాగ్రతతో చది వి ఉద్యోగాలు సాధిం చాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
 
  అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట
 
 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట వేస్తోందని ‘సాక్షి’    ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి    తెలిపారు. త్వరలో వారికోసం ప్రత్యేక పేజీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల కోసం
 జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు
 చేస్తామని రామచంద్రమూర్తి అన్నారు. నిరుద్యోగులకు విజయాల బాటలో ‘సాక్షి’ నిరంతరం చేయూతనిస్తుందని
 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement