- టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి
- ప్రభుత్వం కోరితే డీఎస్సీ నిర్వహణకూ సిద్ధంగా ఉన్నాం
- గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పణ
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో తొమ్మిది పోటీ పరీక్షలు నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)దేనని సంస్థ చైర్మన్ ఘంటా చ క్రపాణి అన్నారు. ఈ నెలాఖరుకల్లా సుమారు రెండు వేలమందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడి ఏడాది పూర్తయినందున చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు శనివారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి 2014-15 వార్షిక నివేదికను సమర్పించారు.
అనంతరం ఘంటా చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పని తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, మరింత మెరుగ్గా పనిచేసేందుకు పలు సూచనలిచ్చారని చెప్పారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రస్తుత విధానాలు, తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, యూపీఎస్సీ చైర్మన్ పాల్గొనే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించినట్లు చక్రపాణి తెలిపారు.
పునరావాస కేంద్రం కాకుండా..
గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొంతమంది వ్యక్తులకు పునరావాస కేంద్రమనే అభిప్రాయం ఉండేదని, సమర్థులైన సభ్యులతో ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ.. వర్క్ స్టేషన్‌ను తలపిస్తోందని చైర్మన్ చక్రపాణి అన్నారు. కమిషన్ నిర్వహించిన తొమ్మిది పోటీ పరీక్షల్లో ఆరు ఆన్‌లైన్‌లోనూ, మూడు సంప్రదాయ పద్ధతిలోనూ నిర్వహించామన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష మెరిట్ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచామని, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి కాగా, సివిల్ ఇంజినీర్లకు ఈ నెలాఖరులోగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ నిర్వహణ విషయమై విద్యాశాఖ తమతో చర్చించిందని, డీఎస్సీ నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి చెప్పామన్నారు. పురపాలక శాఖలో వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు మథీనుద్దీన్ ఖాద్రీ, విఠల్, చంద్రావతి, వివేక్, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్, సాయిలు ఉన్నారు.
నెలాఖరులోగా రెండు వేల మందికి అపాయింట్‌మెంట్లు
Published Sun, Jan 3 2016 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM
Advertisement
Advertisement