TNPSC
-
టీఎన్పీఎస్సీ టైంటేబుల్ విడుదల
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుంచి అక్టోబర్‌లోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు తమకు ప్రభుత్వం ఉద్యోగానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా టీఎన్పీఎస్సీ ప్రతి ఏడాది ఖాళీల సంఖ్యను విడుదల చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం తాజాగా విడుదల చేసిన టైంటేబుల్లో 23 విభాగాల్లో 3,235 ఖాళీలున్నట్లు తెలియజేసింది. అయితే ఈ సంఖ్య పూర్తిగా తాత్కాలికమైనదని, దీనిలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో కొన్ని స్థానాలకు అనివార్యమైన ఇబ్బందులు ఎదురైన పక్షంలో వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేగాక అవసరమైన పక్షంలో టైంటేబుల్లో చూపని విభాగాలు, ఖాళీలను సైతం కొత్తగా చేర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని స్పష్టం చేసింది. కొత్తగా చేర్చే అవకాశం ఉన్న ఖాళీలను పోటీ పరీక్షలకు ముందు లేదా తరువాత కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది 12,218 ఖాళీ స్థానాలను చూపుతూ టైంటేబుల్ విడుదల చేశారు. అన్ని స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంతేగాక టైంటేబుల్లో చూపని 24 ఖాళీలను ప్రకటించారు. వీటిల్లో 18 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మిగిలిన ఆరు ఖాళీల భర్తీకి ఈనెల లేదా వచ్చేనెల పోటీ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. అనేక పోటీ పరీక్షల కోసం 99 పాఠ్యాంశాలను విద్యావేత్తలు రెండేళ్ల కాలంలో సవరించి ఉన్నారు. ఐదేళ్ల కాలంలో పోటీ పరీక్షలు నిర్వహించినా కొన్ని పోస్టులకు అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడి జాప్యం చేశారు. ఆ తరువాత మరలా ఫలితాలు వెల్లడించి నియామక ఉత్తర్వులు సైతం జారీచేశారు. అయితే ఈ ఏడాది అలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అన్ని ఖాళీలకు పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి, నియామక ఉత్తర్వులు అందజేయగలమని టీఎన్పీఎస్సీ ధీమా వ్యక్తం చేస్తోంది.అదేవిధంగా గ్రూప్–2 లో 1547 పోస్టులకు ఇంటర్వూ్యలను ఆగస్టు 19వ తేదీ నిర్వహిస్తున్నట్టుగాను, గ్రూప్–1 లో 57 పోస్టులకు అక్టోబర్ 14వ తేదీ రాత పరీక్షలు జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదికిగాను పట్టికను టీఎన్పీఎస్సీ వెబ్సైట్ www.tnpsc.gov.in లో విడుదల చేశారు. -
నిఘా నీడలో గ్రూప్-4
రాష్ట్రంలో ఆదివారం నిఘా నీడలో గ్రూప్ -4 పరీక్షలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు కారణం ఐదు వేల పోస్టులకు పన్నెండు లక్షల మంది హాజరు కావడమే. ఇక, గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ కానున్నట్టు టీఎన్పీఎస్సీ చైర్మన్ కే అరుల్మొళి ప్రకటించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి పోటీ పరీక్షల నిర్వహణలో టీఎన్పీఎస్సీ పరుగులు తీస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువే కావడంతో ఈ పరీక్షలకు పోటీ పడి హాజరయ్యే పట్టభద్రుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది. ఆ దిశగా తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎన్పీఎస్సీ)నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు ఇటీవల కాలంగా వందల్లో ఉన్న పోస్టులకు సైతం లక్షల్లో దరఖాస్తులు చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునే నిరుద్యోగులు ఎక్కువే. ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, ప్లానింగ్, సర్వేయర్లు, షార్ట్ హ్యాండ్ టైపిస్టులు తదితర 5,451 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఇటీవల టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ పోస్టులకు లక్షల్లో అభ్యర్థులు కదిలారు. నిఘా నీడలో పరీక్ష: పదిహేనులక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో ఎలాంటి లీక్‌లకు, కాపీయింగ్‌కు ఆస్కారం లేని విధంగా నిఘానీడలో పరీక్షలకు టీఎన్పీఎస్సీ చర్యలు తీసుకుంది. చైర్మన్ అరుల్మొళి పర్యవేక్షణలో రాష్ట్రంలో 5,296 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం పది గంటలకు పరీక్ష కావడంతో ఎనిమిదిన్నర గంటల కంతా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.తొమ్మిదిన్నర గంటలకు అభ్యర్థులను లోనికి అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య లోనికి పంపించారు. ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి చంటి బిడ్డల తల్లులు తరలి రావడంతో, వారికి సాయంగా వచ్చిన వాళ్లు చెట్ల కింద, ఆ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్షలు జరిగాయి. విల్లుపురంలోని ఓ కేంద్రంలో నవవధువు అఖిలాండేశ్వరి పరీక్షకు హాజరైంది. తాళికట్టిన చేతులతో తన భార్యను వరుడు ప్రదీప్ తమిళరసన్ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. పరీక్ష ఒంటి గంటకు ముగియడంతో నవ దంపతులు మళ్లీ కల్యాణ మండపానికి చేరుకుని బంధుమిత్రులతో ఫొటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు. పదిహేను లక్షల మందికి పైగా దరఖాస్తు సుకున్నా, పరీక్షకు పన్నెండు లక్షల మంది హాజరు అయ్యారు. లీక్‌లకు , కాపియింగ్‌కు ఆస్కారం ఇవ్వని విధంగా ఐదు వందల ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడు వేల సిట్టింగ్ స్క్వాడ్ల నిఘాతో పరీక్షలు సాగాయి. తొమ్మిదిన గ్రూప్-1 నోటిఫికేషన్ : చెన్నైలో అన్నానగర్, అశోక్‌నగర్, ఐనావరం, ఎగ్మూర్, కీల్పాకం, కొలత్తూరు, ప్లికేన్, నుంగంబాక్కం, పెరంబూరు, పురసైవాక్కం, జార్జ్ టౌన్ , రాయపురం, తిరువొత్తియూరు, తండయార్ పేట, వాషర్మెన్ పేట, మైలాపుర్, అడయార్, టీ నగర్, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో 356 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. లక్షా పన్నెండు వేల మంది అభ్యర్థులు చెన్నైలో పరీక్షలకు హాజరు అయ్యారు. ట్రిప్లికేన్‌లోని పరీక్ష కేంద్రాన్ని టీఎన్పీఎస్సీ చైర్మన్ అరుల్మొళి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరు నెలల్లోపు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పరీక్షల్లో సాధించిన అర్హతల మేరకు ఇంటర్వ్యూలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షలకు తగ్గ సలహాలు, సూచనలు, తదితర వివరాలను సోమవారం నుంచి తమ వెబ్సైట్లో అందించనున్నామని వివరించారు. డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ తదితర గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేయనున్నామని ప్రకటించారు. లీక్ ప్రచారం : విరుదాచలంలో పేపర్ లీక్ ప్రచారం ఊపందుకోవడంతో కలవరం బయలు దేరింది. అయితే, అది ప్రచారంగానే నిర్ధారించారు. విరుదాచలం సమీపంలోని కండియకుప్పంకు చెందిన ఓ యువకుడు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో బాల మురుగన్ అనే ఓ వ్యక్తి ఫోన్ చేసి, పేపర్ లీక్ అయిందని, రూ. ఆరు లక్షలు ఇస్తే, ఆ పేపర్ ఇస్తానంటూ పేర్కొని ఉన్నాడు. దీంతో సమాచారాన్ని ఆ యువకుడు పోలీసులకు అందించారు. అయితే, విచారణలో ఎవరో ఆ యువకుడ్ని మోసం చేయడానికి ప్రయత్నించినట్టు తేలింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు ఫోన్ చేసిన ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
అక్షింతలు
సాక్షి, చెన్నై : టీఎన్పీఎస్సీ వర్గాలపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణతో కూడిన పిటిషన్ సమర్పణలో జాప్యం చేసినందుకు గా ను తలా రూ. ఐదు వేలు చొప్పు న జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఇటీవల ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీ పర్వం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా అరుల్ మోళిని నియమిం చారు. గత ఏడాది కొంత కాలం గా ఆయన తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించినా, ఇటీవల ఆయ న పూర్తి స్థాయిలో బాధ్యత చేపట్టారు. అదే సమయంలో ఆ కమిషన్‌కు 11 మంది సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. అయితే, ఈ కమిటీకి వ్యతిరేకత బయలు దేరింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిలతో పాటుగా పలువురు ఈ కమిటీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయిం చారు. టీఎన్పీఎస్సీ నియమ నిబంధనల మేరకు ఈ కమిటీ నియామకం జరగ లేదని, 11 మందిలో ఏడుగురు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు సంబంధించిన కేసులో విచారణలకు హాజరైన వాళ్లు ఉన్నారని ఆరోపించారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ గత నెల విచారణకు వచ్చింది. విచారణ సమయంలో వివరణతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, టీఎన్పీఎస్సీ కార్యదర్శి, సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప, మిగిలిన వారిలో స్పందన రాక పోవడంతో హైకోర్టు ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. గురువారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణతో కూడిన నివేదికను దాఖలు చేశారు. మిగిలిన వారి తరఫున హాజరైన న్యాయవాదులు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు సమయం వృధా చేసినందుకు గాను కేసు ఖర్చుల నిమిత్తం టీఎన్పీఎస్సీ కార్యదర్శితో పాటుగా మిగిలిన వాళ్లు తలా రూ. ఐదు వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ైజూన్ 13కు వాయిదా వేశారు. -
నెలాఖరులోగా రెండు వేల మందికి అపాయింట్మెంట్లు
- టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి - ప్రభుత్వం కోరితే డీఎస్సీ నిర్వహణకూ సిద్ధంగా ఉన్నాం - గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పణ సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో తొమ్మిది పోటీ పరీక్షలు నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)దేనని సంస్థ చైర్మన్ ఘంటా చ క్రపాణి అన్నారు. ఈ నెలాఖరుకల్లా సుమారు రెండు వేలమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ ఏర్పడి ఏడాది పూర్తయినందున చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2014-15 వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం ఘంటా చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పని తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, మరింత మెరుగ్గా పనిచేసేందుకు పలు సూచనలిచ్చారని చెప్పారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రస్తుత విధానాలు, తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, యూపీఎస్సీ చైర్మన్ పాల్గొనే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించినట్లు చక్రపాణి తెలిపారు. పునరావాస కేంద్రం కాకుండా.. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొంతమంది వ్యక్తులకు పునరావాస కేంద్రమనే అభిప్రాయం ఉండేదని, సమర్థులైన సభ్యులతో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ.. వర్క్ స్టేషన్‌ను తలపిస్తోందని చైర్మన్ చక్రపాణి అన్నారు. కమిషన్ నిర్వహించిన తొమ్మిది పోటీ పరీక్షల్లో ఆరు ఆన్‌లైన్‌లోనూ, మూడు సంప్రదాయ పద్ధతిలోనూ నిర్వహించామన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచామని, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి కాగా, సివిల్ ఇంజినీర్లకు ఈ నెలాఖరులోగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ నిర్వహణ విషయమై విద్యాశాఖ తమతో చర్చించిందని, డీఎస్సీ నిర్వహణకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి చెప్పామన్నారు. పురపాలక శాఖలో వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు మథీనుద్దీన్ ఖాద్రీ, విఠల్, చంద్రావతి, వివేక్, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్, సాయిలు ఉన్నారు.