టీఎన్‌పీఎస్‌సీ టైంటేబుల్‌ విడుదల | Good News to Unemployed : TNPSC TimeTable Release | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 7 2018 9:10 AM | Last Updated on Sun, Jan 7 2018 9:36 AM

Good News to Unemployed : TNPC TimeTable Release - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుంచి అక్టోబర్‌లోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు తమకు ప్రభుత్వం ఉద్యోగానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా టీఎన్‌పీఎస్‌సీ ప్రతి ఏడాది ఖాళీల సంఖ్యను విడుదల చేయడం ఆనవాయితీ.

ఈ ఆనవాయితీ ప్రకారం తాజాగా విడుదల చేసిన టైంటేబుల్‌లో 23 విభాగాల్లో 3,235 ఖాళీలున్నట్లు తెలియజేసింది. అయితే ఈ సంఖ్య పూర్తిగా తాత్కాలికమైనదని, దీనిలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో కొన్ని స్థానాలకు అనివార్యమైన ఇబ్బందులు ఎదురైన పక్షంలో వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేగాక అవసరమైన పక్షంలో టైంటేబుల్‌లో చూపని విభాగాలు, ఖాళీలను సైతం కొత్తగా చేర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని స్పష్టం చేసింది. కొత్తగా చేర్చే అవకాశం ఉన్న ఖాళీలను పోటీ పరీక్షలకు ముందు లేదా తరువాత కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది 12,218 ఖాళీ స్థానాలను చూపుతూ టైంటేబుల్‌ విడుదల చేశారు. అన్ని స్థానాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

అంతేగాక టైంటేబుల్‌లో చూపని 24 ఖాళీలను ప్రకటించారు. వీటిల్లో 18 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మిగిలిన ఆరు ఖాళీల భర్తీకి ఈనెల లేదా వచ్చేనెల పోటీ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. అనేక పోటీ పరీక్షల కోసం 99 పాఠ్యాంశాలను విద్యావేత్తలు రెండేళ్ల కాలంలో సవరించి ఉన్నారు. ఐదేళ్ల కాలంలో పోటీ పరీక్షలు నిర్వహించినా కొన్ని పోస్టులకు అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడి జాప్యం చేశారు.

ఆ తరువాత మరలా ఫలితాలు వెల్లడించి నియామక ఉత్తర్వులు సైతం జారీచేశారు. అయితే ఈ ఏడాది అలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అన్ని ఖాళీలకు పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి, నియామక ఉత్తర్వులు అందజేయగలమని టీఎన్‌పీఎస్‌సీ ధీమా వ్యక్తం చేస్తోంది.అదేవిధంగా గ్రూప్‌–2 లో 1547 పోస్టులకు ఇంటర్వూ్యలను ఆగస్టు 19వ తేదీ నిర్వహిస్తున్నట్టుగాను, గ్రూప్‌–1 లో 57 పోస్టులకు అక్టోబర్‌ 14వ తేదీ రాత పరీక్షలు జరుపుతున్నట్టు  ప్రకటించారు. ఈ ఏడాదికిగాను పట్టికను టీఎన్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌    www.tnpsc.gov.in లో విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement