నిఘా నీడలో గ్రూప్-4 | full security in Group -4 | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో గ్రూప్-4

Published Mon, Nov 7 2016 4:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

నిఘా నీడలో గ్రూప్-4

నిఘా నీడలో గ్రూప్-4

 రాష్ట్రంలో ఆదివారం నిఘా నీడలో గ్రూప్ -4 పరీక్షలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు కారణం ఐదు వేల పోస్టులకు పన్నెండు లక్షల మంది హాజరు కావడమే. ఇక, గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ కానున్నట్టు టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ కే అరుల్‌మొళి ప్రకటించారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి పోటీ పరీక్షల నిర్వహణలో టీఎన్‌పీఎస్‌సీ పరుగులు తీస్తున్నది. ప్రభుత్వ  ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువే కావడంతో ఈ పరీక్షలకు పోటీ పడి హాజరయ్యే పట్టభద్రుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది.  ఆ దిశగా తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎన్‌పీఎస్సీ)నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు ఇటీవల కాలంగా వందల్లో ఉన్న పోస్టులకు సైతం లక్షల్లో దరఖాస్తులు చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునే నిరుద్యోగులు ఎక్కువే. ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, ప్లానింగ్, సర్వేయర్లు, షార్ట్ హ్యాండ్ టైపిస్టులు తదితర 5,451 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఇటీవల టీఎన్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో  ఈ పోస్టులకు లక్షల్లో అభ్యర్థులు కదిలారు.
 
 నిఘా నీడలో పరీక్ష:  పదిహేనులక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో ఎలాంటి లీక్‌లకు, కాపీయింగ్‌కు ఆస్కారం లేని విధంగా నిఘానీడలో పరీక్షలకు టీఎన్‌పీఎస్‌సీ చర్యలు తీసుకుంది. చైర్మన్ అరుల్‌మొళి పర్యవేక్షణలో రాష్ట్రంలో 5,296 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం పది గంటలకు పరీక్ష కావడంతో ఎనిమిదిన్నర గంటల కంతా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.తొమ్మిదిన్నర గంటలకు అభ్యర్థులను లోనికి అనుమతించారు.
 
 క్షుణ్ణంగా తనిఖీల అనంతరం కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య లోనికి పంపించారు. ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి చంటి బిడ్డల తల్లులు తరలి రావడంతో, వారికి సాయంగా వచ్చిన వాళ్లు చెట్ల కింద, ఆ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్షలు జరిగాయి. విల్లుపురంలోని ఓ కేంద్రంలో నవవధువు అఖిలాండేశ్వరి పరీక్షకు హాజరైంది. తాళికట్టిన చేతులతో తన భార్యను వరుడు ప్రదీప్ తమిళరసన్ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. పరీక్ష ఒంటి గంటకు ముగియడంతో నవ దంపతులు మళ్లీ కల్యాణ మండపానికి చేరుకుని బంధుమిత్రులతో ఫొటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు. పదిహేను లక్షల మందికి పైగా దరఖాస్తు సుకున్నా, పరీక్షకు పన్నెండు లక్షల మంది హాజరు అయ్యారు. లీక్‌లకు , కాపియింగ్‌కు ఆస్కారం ఇవ్వని విధంగా ఐదు వందల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఏడు వేల సిట్టింగ్ స్క్వాడ్‌ల నిఘాతో పరీక్షలు సాగాయి.
 
 తొమ్మిదిన గ్రూప్-1 నోటిఫికేషన్ :
 చెన్నైలో అన్నానగర్, అశోక్‌నగర్, ఐనావరం, ఎగ్మూర్, కీల్పాకం, కొలత్తూరు, ప్లికేన్,  నుంగంబాక్కం, పెరంబూరు, పురసైవాక్కం, జార్జ్ టౌన్ , రాయపురం, తిరువొత్తియూరు, తండయార్ పేట, వాషర్‌మెన్ పేట, మైలాపుర్, అడయార్, టీ నగర్, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో 356 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. లక్షా పన్నెండు వేల మంది అభ్యర్థులు చెన్నైలో పరీక్షలకు హాజరు అయ్యారు. ట్రిప్లికేన్‌లోని పరీక్ష కేంద్రాన్ని  టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ అరుల్‌మొళి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరు నెలల్లోపు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పరీక్షల్లో సాధించిన అర్హతల మేరకు ఇంటర్వ్యూలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షలకు తగ్గ సలహాలు, సూచనలు, తదితర వివరాలను సోమవారం నుంచి తమ వెబ్‌సైట్‌లో అందించనున్నామని వివరించారు. డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ తదితర గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేయనున్నామని ప్రకటించారు.
 
 లీక్ ప్రచారం : విరుదాచలంలో పేపర్ లీక్ ప్రచారం ఊపందుకోవడంతో కలవరం బయలు దేరింది. అయితే, అది ప్రచారంగానే నిర్ధారించారు. విరుదాచలం సమీపంలోని కండియకుప్పంకు చెందిన ఓ యువకుడు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో బాల మురుగన్ అనే ఓ వ్యక్తి ఫోన్ చేసి, పేపర్ లీక్ అయిందని, రూ. ఆరు లక్షలు ఇస్తే, ఆ పేపర్ ఇస్తానంటూ పేర్కొని ఉన్నాడు. దీంతో సమాచారాన్ని ఆ యువకుడు పోలీసులకు అందించారు. అయితే, విచారణలో ఎవరో ఆ యువకుడ్ని మోసం చేయడానికి ప్రయత్నించినట్టు తేలింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు ఫోన్ చేసిన ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement