
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి సాహిత్య ప్రక్రియలో తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది. చక్రపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర అనే రచనకు ఈ పురస్కారం దక్కింది. 2015వ సంవత్సరానికిగాను ఎంపికైన ఈ పురస్కారాన్ని సోమవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అందజేశారు. తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
పురస్కారం కింద రూ.20,116 నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ... నేను చదువుకున్న విశ్వవిద్యాలయంలో తీసుకున్న సర్టిఫికెట్ ఎంత విలువైనదో ఈ పురస్కారం కూడా అంతే గొప్పదన్నారు. సీఎం కేసీఆర్‌ను తాను ఏనాడూ పదవి అడగలేదని, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవిని కూడా తాను వద్దన్నా పట్టుబట్టి నియమించారని తెలిపారు. తనను గుర్తించి సత్కరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అల్లం నారాయణ మాట్లాడుతూ... టీఎస్‌పీఎస్సీలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన ఘనత చక్రపాణిదే అన్నారు. కాగా, ఉత్తమ రచయిత్రి పక్రియలో 2016వ సంవత్సరానికిగాను రచయిత్రి తిరునగరి దేవకీదేవికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment