ఉద్యోగాల గంట మోగింది | first notification release from tspsc | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల గంట మోగింది

Published Thu, Aug 20 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ఉద్యోగాల గంట మోగింది

ఉద్యోగాల గంట మోగింది

► 770 సివిల్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ తొలి నోటిఫికేషన్
► వచ్చే నెల 20న ఆన్‌లైన్ పరీక్ష,
►25న ఫలితాలు, మెరిట్ జాబితాలు
► 3,783 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
►నెలాఖరులో మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు
►వచ్చే నెలలో వ్యవసాయ, రవాణాశాఖల్లో..
►అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్‌లో గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
►వీటికి నెలాఖరులోగా పూర్తిస్థాయి సిలబస్
►టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి


 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తొలి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ శాఖల్లో 770 సివిల్ ఇంజనీర్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీ కోసం బుధవారం దీనిని జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోగా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చు. ఇక మరిన్ని శాఖల్లో పలు పోస్టులకు ఈ నెలాఖరులోగా, అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్‌లో గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్‌తో కలసి చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ వివరాలను వెల్లడించారు.

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంతో మంది ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో జారీ చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను డిసెంబర్ నాటికి జారీచేస్తామన్నారు. వివిధ శాఖల నుంచి రోస్టర్, రిజర్వేషన్ల వివరాలు రాగానే మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. మొత్తంగా కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన 3,783 పోస్టులకు డిసెంబర్ నాటికి జారీ చేస్తామని తెలిపారు.
 చక్రపాణి వెల్లడించిన మరిన్ని అంశాలు
 ‘‘గ్రూప్ పోస్టులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తదితర కేటగిరీల పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపకల్పన జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరులోగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తాం. 400కుపైగా గ్రూప్-2 పోస్టులకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్‌లో రాతపరీక్ష నిర్వహిస్తాం. గ్రూప్-1 పోస్టులు ప్రస్తుతం 53 ఉన్నాయి. అందులో కొన్ని క్లియర్‌గా లేవు. డిసెంబర్‌లో వాటికి నోటిఫికేషన్ జారీచేస్తాం. కొత్త సిలబస్‌పై సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో గడువు ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నాం. దాంతోపాటు అప్పటిలోగా ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చి, మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రూప్-2లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఏడాదికి గ్రూప్-2 ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.

తెలంగాణలో అన్నింటికి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తాం. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చర్యలు చేపడుతున్నాం. గ్రూప్-1, 2లలో మాత్రం ఆన్‌లైన్ పరీక్ష ఉండదు. మిగతా వాటిల్లో అవసరమైన మేరకు, ఆన్‌లైన్ పరిజ్ఞానం అవసరమున్న పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షలు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. రవాణా శాఖలో ఏఎంవీఐలు పనిచేయాల్సింది కంప్యూటర్‌పైనే. కాబట్టి ఆ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షలే ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పోస్టుల్లో దరఖాస్తుదారులు 30 వేలు దాటితే ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహిస్తాం. ముస్లిం రిజర్వేషన్ 4 శాతం అమలులో ఉంటుంది..’’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చక్రపాణి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, వివాదాలకు చోటు లేకుండా చూస్తామని చెప్పారు. అభ్యర్థులు నమ్మకంతో ఉండాలని, ఉమ్మడి రాష్ట్రంలోని కమిషన్‌తో పోల్చవద్దని.. తమ పనితీరు చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
 ============
 తొలి నోటిఫికేషన్ (సివిల్ ఇంజనీర్) పోస్టులు..
 విభాగం                    పోస్టులు
 ఆర్‌డబ్ల్యూఎస్                                                   418            
 పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్                        121
 మున్సిపల్ , పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్  5
 రోడ్లు భవనాల శాఖలో                                          83
 నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో               143
 మొత్తం                                                             770
 ---------
 - ఈ పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్/బీఈ చేసిన వారు అర్హులు. ఈ ఏడాది జూలై 1 నాటికి 44 ఏళ్లలోపు వయస్సు ఉండాలి (రిజర్వేషన్ మినహా). వేతన స్కేలు రూ.37,100-91,450. వచ్చే నెల 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచిన నోటిఫికేషన్‌లో పొందవచ్చు.
 - 450 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష, 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి. వచ్చే నెల 25వ తేదీ నాటికి ఫలితాలు, మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. తరువాత ఇంటర్వ్యూలు ఉంటాయి.
 - హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో రాతపరీక్ష నిర్వహిస్తారు. 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే అవకాశం.
 - కమిషన్ చేపట్టిన ప్రత్యేక విధానం వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో ఇప్పటికే 2.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుత పోస్టులకు అర్హులైన వారు 10వేల మంది వరకు ఉన్నారు. వీరంతా మూడు నిమిషాలు కేటాయించి వ్యాలిడేట్ చేస్తే చాలు. దరఖాస్తు చేసినట్లే. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓటీఆర్ చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement