వచ్చే నెలలో గ్రూపు-2 అనుబంధ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెలలో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం గతంలో 439 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా.. ఇటీవల మరో 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీపై టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినా.. పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా మళ్లీ 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య 1,032కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులను గతంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ పరిధిలోకి తెస్తూ టీఎస్‌పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.
గతంలో గ్రూప్-2 రాసేందుకు 5.64 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం కల్పిస్తూ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ఆలోచనలు చేస్తోంది. అయితే అంతకన్నా ముందు తాజాగా ప్రభుత్వం ఆమోదిం చిన పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి ఇండెంట్లు, రిజర్వేషన్, రోస్టర్ వివరాలు రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఆయా శాఖల అధికారులతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి సింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే నెలలో వీలైతే మొదటి వారం లేదా రెండో వారం నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశాలను టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.