గ్రూప్–2లో మరింత తగ్గిన హాజరు
♦ 63.02 శాతానికి పరిమితం
♦ పేపర్–3, పేపర్–4 పరీక్షలూ ప్రశాంతం
♦ పరీక్షల నిర్వహణలో సహకరించిన
♦అందరికీ కృతజ్ఞతలు: ఘంటా చక్రపాణి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 పోస్టుల భర్తీకి చేపట్టిన గ్రూప్–2 పరీక్షల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పేపర్–3, పేపర్–4 రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గింది. శుక్రవారం జరిగిన పేపర్–1, పేపర్–2 పరీక్షలకు 65.60 శాతం మంది హాజరవగా ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 63.02 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని కేంద్రాల్లో ఒకే బార్‌కోడ్‌గల ప్రశ్నపత్రం, ఓఎంఆర్ జవాబుపత్రాల జారీలో పొరబాట్లు దొర్లగా పలు చోట్ల బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించాయి. అయితే పేపర్–1, పేపర్–2 పరీక్షలతో పోలిస్తే పెద్దగా గందరగోళం లేకుండానే మొత్తంమీద పేపర్–3, పేపర్–4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల తొలిరోజు (శుక్రవారం) ఎదురైన అనుభవాలతో అభ్యర్థులు జాగ్రత్తపడ్డారు. పరీక్షలకు చాలా చోట్ల వారు సకాలంలో హాజరయ్యారు. ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలో దాదాపు పది మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం నిబంధన, సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం వంటి కారణాల వల్ల పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయారు.
జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల పబ్లిక్ స్కూల్‌లో కేంద్రంలో 14 మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం ఒకే నంబర్‌కు బదులు వేర్వేరు నంబర్లతో ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో మూడు పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు మొరాయించాయి. మొదటి రోజు పరీక్షల సందర్భంగా నెట్‌వర్క్ సమస్య కారణంగా అభ్యర్థులందరి బయోమెట్రిక్ సమాచారం సేకరణ సాధ్యం కాలేదని, కానీ ఆదివారం పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరి బయోమెట్రిక్ డేటాను సేకరించామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించారని, వారి అనుమానాలను కమిషన్ ఎప్పటికప్పుడు నివృత్తి చేసిందన్నారు. కమిషన్ సభ్యులతో కూడిన మూడు బృందాలు హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరిశీలన జరిపినట్లు వివరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సూపరింటెండెంట్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందన్నారు. టీఎస్‌పీఎస్సీ సిబ్బందితోపాటు 350 స్పెషల్ స్క్వాడ్‌లు పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన జరిపాయన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.
గర్భిణికి పరీక్ష...
సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన వేములవాడకు చెందిన నంభీ నాగరాణి అనే ఏడు నెలల గర్భిణి రెండో అంతస్తులోని పరీక్ష హాల్లోకి వెళ్లలేక ఇబ్బంది పడింది. ఆమె విన్నపం మేరకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ జేసీ యాస్మిన్ బాషాకు సమాచారం అందించగా ఆమె ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని సహాయకుల ద్వారా నాగరాణిని మెట్లపై ఉన్న గదికి పంపించడానికి ప్రయత్నించారు. ఆమె ఎక్కలేకపోవడంతో ప్రిన్సిపాల్ ప్రాంగణంలో ప్రత్యేక పర్యవేక్షణ మధ్య పరీక్ష రాయించారు.
అభ్యర్థి బిడ్డకు మహిళా కానిస్టేబుల్ స్తన్యం
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఉన్న జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన మాతృత్వపు మమకారానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు నెలల బిడ్డతో కలసి గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ తల్లి... పరీక్ష కేంద్రం బయట తన బంధువుకు బిడ్డను అప్పగించి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి పాల కోసం గుక్కపెట్టింది. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఆ పాపకు పాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చింది.