సూర్యాపేట: పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా మంది ఉపాధ్యాయులు సెలవు కోసం దరఖాస్తు చేయకుండా అనధికారికంగా దీర్ఘకాలం విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హాజరుపై ప్రత్యేక నిఘా పెట్టాలని పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌జేడీలు, డీఈఓలకు ఆదేశాలు ఇచ్చారు.
అనుమతిపై విదేశాలకు వెళ్లిన వారు గడువు ముగిసినా విధుల్లో చేరకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనధికారిక గైర్హాజరుతో విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెలవుల వివరాలను వెంటనే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ముందుకెళ్తోంది.
950 స్కూళ్లు.. 3,900 మంది టీచర్లు..
జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3,900 మంది వరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
అయితే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టి వెళ్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విద్యా శాఖ సెలవుల కంప్యూటీకరణకు కసరత్తు చేపట్టింది.
కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు బాధ్యతలు..
ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే బాధ్యతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ప్రతి హెచ్‌ఎం 10 నుంచి 15 పాఠశాలలను పర్యవేక్షించనున్నారు. కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని ప్రతినెలా 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
సెలవుల రిజిస్టర్‌ను పాఠశాల హెచ్‌ఎం మాత్రమే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రతి ఉపాధ్యాయుడు ఏ నెలలో ఎన్ని సీఎల్‌లు, ఓసీఎల్‌లు వినియోగించుకున్నారో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయుల అనధికారిక గైర్హాజరుకు బ్రేక్ పడనుంది. అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పారదర్శకత పెరుగుతుంది
ఉపాధ్యాయుల హాజరును ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నాం. దీనికి తోడు సెలవుల కంప్యూటరీకరణ వల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్లర్లు కంప్యూటరీకరణ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల పకడ్భందీగా రికార్డులను నిర్వహించే అవకాశాలుంటాయి. ఉపాధ్యాయుల డుమ్మా ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఇది దోహదపడుతుంది. – అశోక్, డీఈఓ, సూర్యాపేట
Comments
Please login to add a commentAdd a comment