Suryapet District News
-
ఫై్లఓవర్ బ్రిడ్జి నిర్మించకుండా చూస్తా
అర్వపల్లి: అర్వపల్లిలోని 365 హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించకుండా చూస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే యోచనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ సోమవారం రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ బోయలపల్లి రేఖ .. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బిడ్జి నిర్మాణ ప్రతిపాదనలతో స్థానిక ప్రజలు పడుతున్న టెన్షన్‌పై ‘ఫ్లై ఓవర్ గుబులు’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని ఆమె మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో మాట్లాడి అర్వపల్లిలో ఫ్లైఓవర్ నిర్మించకుండా చూడాలని కోరినట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారని రేఖ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
గ్రామసభలకు వేళాయే..
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితా ఆమోదానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే తయారు చేసిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించి గ్రామసభ తీర్మానం ద్వారా ఆమోదించనున్నారు. ఇందుకోసం ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సభల్లో అర్హుల జాబితా ఆమోదంతో పాటు నూతనంగా ఆయా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. 25వ తేదీన తుది జాబితాలు రూపొందించి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవంలో అర్హులకు పథకాలను ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహణ జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్రామస్థాయిలో ఎంపిక చేసిన అర్హుల జాబితాలను సంబంధిత గ్రామసభ నిర్వహించే అధికారి ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకానికి సంబంధించి ఏకగ్రీవంగా గ్రామసభ అర్హుల జాబితాను ఆమోదించినట్లు ప్రకటిస్తారు. లేదంటే సంబందిత పథకంపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయో వాటన్నింటిని లిఖిత పూర్వకంగా తయారు చేసి రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఫ నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహణ ఫ నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితా ప్రదర్శన ఫ వాటి ఆమోదంతో పాటు నూతన దరఖాస్తుల స్వీకరణ ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం దరఖాస్తుదారుల్లో టెన్షన్ రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాగా మార్చి సాగుకు యోగ్యమైన భూమికే ఎకరానికి రూ.12వేలను రెండువిడతల్లో ఇవ్వనుంది. గతంలో రైతుబంధు 6.19 లక్షల ఎకరాలకు అందగా.. జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్వేలో సాగుకు యోగ్యంగా లేని భూమి దాదాపు 6,339 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ భూమి వివరాలను గ్రామసభలో సర్వే నంబర్ వారీగా చదివి వినిపిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు ఉంటే మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ఇక జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే 3,24,158 రేషన్ కార్డులు ఉండగా కొత్త కార్డుల కోసం 28వేల దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. మరో 52 వేల దరఖాస్తులు పాత రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పించేందుకు నమోదు చేసుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో 2,31,264 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా మంగళవారం నుంచి నిర్వహించే గ్రామసభల్లో తమ పేర్లు వస్తాయా..? రావా అన్న ఉత్కంఠతో ఉన్నారు. -
ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు అభినందనీయం
భానుపురి (సూర్యాపేట) : ఉద్యోగులు, ప్రజల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో ఎస్బీఐ ఇంటెన్సివ్ బ్రాంచ్‌ను అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బ్యాంక్ ద్వారా రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాష్ లావాదేవీలు, సాయంత్రం 6గంటల వరకు క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతాయని తెలిపారు. బ్యాంక్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఉపేంద్ర భాస్కర్, ఎల్డీఎం బాపూజీ, బ్యాంక్ మేనేజర్ అఖిల, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యం కలిగి ఉండటం ముఖ్యం
చివ్వెంల(సూర్యాపేట) : ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి దాని ప్రకారం ప్రణాళికతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి పి,శ్రీవాణి సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని విజయ్కాలనీలో గల బాలసదన్‌ను ఆమె సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే తమ భవిష్యత్‌కు బాటలు వేస్తుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, వ్యాయామం చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటవస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా వెల్ఫేర్ అధికారి కె,నర్సింహారావు, బి. రవికుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, జి.లింగమ్మ పాల్గొన్నారు. డీటీఎఫ్ నూతన కమిటీ ఎన్నికసూర్యాపేట: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీని సిటీ టాలెంట్ స్కూల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కొచ్చెర్ల వేణు, ఉపాధ్యక్షులుగా జి. వెంకటేశ్వర్లు, జె. రమణ, జి. ఆనంద్భాస్కర్తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎస్. భాస్కర్ వ్యవహరించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. ఎన్నికకు సహకరించిన డీటీఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు. వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు అర్వపల్లి: వచ్చే వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ అట్లూరి కామేష్ తెలిపారు. రబీ సీజన్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికై అడివెంల విద్యుత్‌సబ్ స్టేషన్‌ను సోమవారం ఎస్ఈ బి. ఫ్రాంక్లిన్, డీఈ ఎల్. ఎ. శ్రీనివాస్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న లోడ్, డిమాండ్‌ను తీర్చడానికి జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించారని చెప్పారు. అడివెంలలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్పై ఓవర్‌లోడ్ సమస్య ఉన్నందున వెంటనే సుమారు రూ. 1.20 కోట్లతో 8ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని మంగళవారం బిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం ఏడీఈ రాములునాయక్, ఏఈ వాస శ్రీకాంత్, కాంట్రాక్టర్ వి. జానకిరెడ్డి, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ధర్నా వాయిదా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో ఈనెల 21వ తేదీన బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మధ్యపెడుతోందంటూ బీఆర్ఎస్ మహా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. మహాధర్నా అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. ధర్నాకు అనుమతించడంలేదని సోమవారం ఉదయం పోలీసులు లేఖ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సోమవారం మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. పోలీసులు అనుమతి నిరాకరించిన విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని పేర్కొన్న హైకోర్టు.. ఈ కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బీఆర్ఎస్ ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
’సూర్యాపేట గురుకుల పాఠశాల హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. - 8లోసూర్యాపేటటౌన్ : ఐదవ జోనల్ పోలీస్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను సోమవారం సూర్యాపేట పట్టణంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పోలీసు సిబ్బందికి పురుషులు, మహిళల విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జట్లు, జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించారు. ఇందులో ఎంపికై నక్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025పాల్గొననున్నట్లు అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఐలు హరిబాబు, శ్రీనివాస్, సురేష్, రాజశేఖర్, ఎం.అశోక్, కె.అశోక్, సాయిరామ్ ఉన్నారు. -
మంత్రులను కలిసిన పెద్దగట్టు ఆలయ కమిటీ
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని సచివాలయంలో శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఫిబ్రవరిలో జరిగే జాతరకు రావాలని మంత్రులను కోరారు. జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొప్పుల వేణారెడ్డి, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, పోలేబోయిన నరేష్ యాదవ్, కుర్ర సైదులు, వీరబోయిన సైదులు యాదవ్, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, సిరపంగి సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలో ఉన్న 20వేల మంది ఆర్టిజన్ల విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ల కన్వర్షన్ వల్ల విద్యుత్ సంస్థలపై పెద్దగా ఆర్థిక భారం పడదని తెలిపారు. ఈ విషయమై గతంలో డిప్యూటీ సీఎం, ట్రాన్స్‌కో, డిస్కం సీఎండీలకు వినతిపత్రాలు అందజేయగా ప్రస్తుతం చర్చ నడుస్తోందన్నారు. కన్వర్షనా లేక స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం గ్రేడ్ చెంజ్, ఇంక్రిమెంట్లు ఇవ్వడమా అని చర్చ నడుస్తుందన్నారు. కన్వర్షన్ చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ జేఏసీ జిల్లా చైర్మన్ మేడె మారయ్య, కన్వీనర్ కొండ నకులుడు, వైస్ చైర్మన్ చినపంగి తిరుపయ్య, డివిజన్ చైర్మన్ ఎం.డి. రహమాన్, కన్వీనర్ సంకేపల్లి దయాకర్, దోమట్టి మురహరి, వాంకుడోతు జీవన్, సీఐటీయు నాయకులు వెంకటనారాయణ, సీహెచ్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వరిసాగే అత్యధికం
యాసంగిలో 4.15 లక్షల ఎకరాల్లో సాగైన వరి భానుపురి (సూర్యాపేట): జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 4,15,749 ఎకరాల్లో జిల్లా రైతులు పంటలను సాగు చేశారు. ఇందులో ఎస్సారెస్పీ ఆయకట్టు మినహా అంతటా వరిసాగు ఊపందుకుంది. ఈ ఆయకట్టుకు నీటి విడుదల సక్రమంగా లేకపోవడంతో వేలాది ఎకరాలు భూములు బీడుగానే ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిధిలో ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. జిల్లా అంతటా మరో వారం రోజుల పాటు నాట్లు పడే అవకాశం ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 4.15 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా.. మరో 30 వేల ఎకరాల వరకు నాట్లు పడనున్నాయి. ఆరుతడి పంటలు కేవలం 749 ఎకరాల్లోనే సాగు చేశారు. సమృద్ధిగా నీరుండి.. వానాకాలం కొంత ఆలస్యంగానైనా భారీ వర్షాలే పడ్డాయి. చెరువులు, కుంటలు నిండడంతో పాటు జిల్లా రైతాంగానికి సాగు నీటిని అందించే మూసీ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు సైతం నిండాయి. వానాకాలం సైతం ఎస్సారెస్పీ మినహా రెండు ప్రాజెక్టుల నుంచి సమృద్ధిగా నీరిచ్చినా యాసంగి సీజన్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రాజెక్టుల నుంచి వరి సాగు కోసం నీటిని విడుదల చేశారు. సాగర్, మూసీ ప్రాజెక్టులకు ముందుగానే నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో వరిసాగు జోరుగా సాగుతోంది. ఇప్పటికే వరినాట్లు చివరి దశకు చేరాయి. 20223–24 యాసంగి సీజన్‌కు కంటే దాదాపు 10వేల ఎకరాల్లో ఇప్పటికే అధికంగా రైతులు వరి సాగు చేశారు. మరో వారం రోజుల పాటు నాట్లు కొనసాగనుండడంతో వరిసాగు మరింత పెరిగే అవకాశముంది.వెదజల్లే పద్ధతిలో సాగుచేసిన వరిపైరు వరిజొన్నలుచిరుధాన్యం మొక్కజొన్న4,15,00021260ఎస్సారెస్సీ ఆయకట్టులో అంతంతే.. బోరు, బావుల కింద చాలామంది రైతులు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిని అవలంబించడంతో సాగు పూర్తయింది. సాగర్, మూసీ కింద ముమ్మరంగా సాగుతుండగా.. ఎస్సారెస్సీ ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. జనవరి 1వ తేదీ నుంచి వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసినా.. ఇప్పటి వరకు చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతేడాది కన్నా దాదాపు 94,498 ఎకరాల్లో వరి సాగు అధికంగా ఉంటుందని అధికారులు భావించినా.. ఆ స్థాయిలో వరి సాగు జరిగే అవకాశం లేనట్లు అంచనా. ఆరుతడి పంటల్లో అత్యధికంగా వేరుశనగ 350 ఎకరాలు, మొక్కజొన్న 260 ఎకరాల్లో సాగైంది. పెసర కేవలం 25 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. ఫ మరో 30 వేల ఎకరాలు నాట్లకు సిద్ధం ఫ కేవలం 749 ఎకరాల్లోనే ఆరుతడి పంటలు ఫ వారం రోజుల్లో పూర్తికానున్న పంటల సాగు -
షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టర్‌లో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలపై గ్రామసభలు నిర్వహిస్తుందన్నారు. ఎక్కడా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా అధికారులందరూ జాగ్రత్తగా సభలు నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రదర్శించాలని, గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను స్వీకరించి రిజిస్టర్లో రాయాలన్నారు. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. ఈకాన్ఫరెన్స్లో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి, డీసీఎస్ఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఫ్లైఓవర్ నిర్మించొద్దని సర్వే అడ్డగింత
అర్వపల్లి : అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేస్తున్న సిబ్బందిని సోమవారం స్థానికులు అడ్డుకొని నిలదీశారు. ఇప్పటికే రెండు జాతీయ రహదారుల విస్తరణ సందర్భంగా స్థానికంగా వందలాది ఇళ్లు, దుకాణాలను కోల్పోయామని, మళ్లీ ఎవరి కోసం ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సర్వే వద్దంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ప్రధానంగా అర్వపల్లిలో వైజంక్షన్ను గతంలో ప్రకటించిన ప్రకారం అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైరబోయిన సునీతరామలింగయ్యతోపాటు స్థానికులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం
హుజూర్నగర్: రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్నగర్ హౌసింగ్ కాలనీ వద్ద రూ.14 కోట్లతో నిర్మించనున్న ఐటీఐ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని చదువుకున్న యువత కోసం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ పనులు మొదలు పెట్టామని, ఇప్పుడు ఐటీఐ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశామన్నారు. దీనివలన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందగలుగుతారని మంత్రి అన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల కోసం గతంలో మీ సేవ కేంద్రాల్లో, ప్రజావాణిలో, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకుని, వాటిని పరిశీలిస్తామన్నారు. హుజూర్నగర్ హౌసింగ్ కాలనీని రాష్టంలోనే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కాలనీ తన పదేళ్ల తపస్సు అని, త్వరలో అన్ని బ్లాకుల పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా సింగిల్ రోడ్డు ఉండకుండా అన్ని డబుల్ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, సాగునీరు, తాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించారని, లబ్ధిదారుల జాబితాను ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామసభల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. జాబితాలో తమ పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామ సభలో దరఖాస్తులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈనెల 26 నుంచి నాలుగు పథకాలు అమలు పరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, ఉపాధి, శిక్షణ శాఖ ఆర్డీడీ ఎస్.రాజా, ప్రిన్సిపాల్ జింజిరాల వెంకన్న, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్‌రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్, అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
రాజ్యాంగం పూర్తిస్థాయి అమలుకు పోరు
భానుపురి (సూర్యాపేట): భారత స్వాతంత్య్ర సంగ్రామ ఆకాంక్షల ప్రతిబింబమే భారత రాజ్యాంగమని, దాని పూర్తిస్థాయి అమలుకు మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగం, గమ్యం, గమనం అనే అంశంపై ఆదివారం సూర్యాపేటలో ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ఎంతో శాసీ్త్రయంగా ఎంతో మేధోమధనంతో చర్చలు జరిపిన అనంతరం అమలులోకి వచ్చిందన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికీ సంబంధించిన వ్యక్తి కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్న ఓటు హక్కు అంబేద్కర్ ఎంతో సాహసంతో కొట్లాడి రాజ్యాంగంలో పొందుపర్చిన అంశమని చెప్పారు. అంతకుముందు సూర్యాపేటలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద మలిదశ తెలంగాణ అమరవీరుడు కొండేటి వేణుగోపాల్‌రెడ్డి వర్ధంతిలో కోదండరాం పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, తండు నాగరాజుగౌడ్, కిరణ్, కొంచెం చంద్రకాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే వర్ధంతి కార్యక్రమంలో నాయకులు బైరి రమేష్, బొడ్డు శంకర్, జాటోతు శ్రీను, కొల్లు కృష్ణారెడ్డి, వినయ్‌గౌడ్, సూర్యనారాయణ, ఏనుగు మధుసూదన్, యాకోబురెడ్డి, సతీష్, ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఫ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం -
ఫ్లైఓవర్ గుబులు!
అర్వపల్లిలో 365, 365బీ హైవేలు కలిచే చోట నిర్మాణానికి ప్రతిపాదన రూ.20 లక్షలు నష్టపోయా గతంలో హైవే విస్తరణ సందర్భంగా రూ.20లక్షల విలువ చేసే ఇంటిని కోల్పోయాను. ఇటీవలె తన వ్యవసాయ భూమి కొంత అమ్మి మళ్లీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాను. ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మళ్లీ కొత్తగా కట్టుకున్న ఇళ్లు కూడా కోల్పోతాను. – కట్టెల కృష్ణ, అర్వపల్లి ఇల్లు పోద్దని భయంగా ఉంది 365 హైవే వెంట జాజిరెడ్డిగూడెం రూట్లో రూ.40లక్షలతో కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నా. ఈ తరుణంలో ఫ్లైఓవర్ నిర్మాణమని నా ఇంటి ముందు నుంచే సర్వే చేశారు. ఇంతగానం కష్టపడి కట్టుకుంటున్న ఇల్లు పోద్దనే భయంగా ఉంది. – గజ్జి శంకర్, అర్వపల్లి ప్రజలకు అవసరం లేనిది ఎందుకు మా స్వగ్రామం జాజిరెడ్డిగూడెం. ఇటీవల అర్వపల్లిలోని తుంగతుర్తి రోడ్డులో కొత్త ఇల్లు కట్టుకున్నాను. ఫ్లైఓవర్ నిర్మాణానికి సర్వే చేశారు. ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇల్లు పోయే అవకాశం ఉంది. ప్రజలకు అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలి. – కోటమర్తి శ్రీనివాస్అర్వపల్లి: సూర్యాపేట–జనగామ, నకిరేకల్–తానంచర్ల రెండు జాతీయ రహదారులకు ప్రధాన కూడలి అయిన జాజిరెడ్గిగూడెం మండలం అర్వపల్లిలో ఫ్లైఓవర్ నిర్మించాలని మళ్ల ప్రతిపాదన రావవడంతో స్థానిక ప్రజల్లో టెన్షన్ మొదలైంది. గతంలోనే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సర్వే సందర్భంగా విషయం బయటకు రావడంతో స్థానికులు అప్పట్లో ఆందోళన బాటపట్టారు. ఇక్కడ అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణం ఎందుకంటూ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనను రద్దు చేయించారు. ఇప్పటికే నష్టపోయిన ప్రజలు గతంలో అర్వపల్లిలో 365, 365బీ రెండు జాతీయ రహదారుల విస్తరణ సందర్భంగా ఐదేళ్ల క్రితం 200 ఇళ్లు కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా తొలగించారు. అయితే ఇక్కడ పూర్తిగా దేవాదాయశాఖ భూమి కావడంతో ఇళ్ల యజమానులకు స్థలానికి సైతం నష్ట పరిహారం రాలేదు. కేవలం ఇళ్లకు మాత్రమే పరిహారం అందిచడంతో ఇళ్లు, దుకాణాల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. రెండు హైవేల విస్తరణ పూర్తయిన ఏడాదికే అప్పట్లో 365 హైవేపై స్థానికంగా ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు సర్వే మొదలు పెట్టడంతో ప్రజల ఆందోళన మూలంగా విరమించుకున్నారు. మళ్లీ తెరపైకి ఫ్లైఓవర్ అర్వపల్లిలో జాతీయ రహదారుల విస్తరణ పూర్తయ్యాక వై జంక్షన్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హైవే అధికారులు అప్పట్లో ప్రకటించారు. కానీ, ఇంత వరకు జంక్షన్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదిలా ఉంటే ఇక్కడ ఎలాంటి అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి తెచ్చారు. అర్వపల్లిలో రెండు రోజులుగా హైవే అధికారులు సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సర్వేను సీతారాంపురం సమీపంలోని 71డీబీఎం కాలువ వద్ద నుంచి తుంగతుర్తి రోడ్డు వెంట వై జంక్షన్ మీదుగా జాజిరెడ్డిగూడెం రోడ్డులో ముదిరాజ్ కాలనీ సమీపం వరకు సర్వే చేపట్టారు. ఈ రోడ్డులోని సుమారు 200 ఇళ్లు, దుకాణాలను బ్రిడ్జి నిర్మాణంలో కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ యజమానులంతా గతంలోనే రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయి అప్పులు చేసి మరీ కొత్తగా నిర్మించుకున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హైవే అధికారులు ఒక్కసారిగా మళ్లీ ఫ్లైఓవర్ అంటుండడంతో తామేం పాపం చేశామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై ఓవర్ యోచనను విరమించుకొని వై జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణం వద్దని ముక్తకంఠంతో అంటున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం వద్దంటూ ఆందోళన బాట పట్టారు. ఫ సర్వే కూడా మొదలు పెట్టిన అధికారులు ఫ నిర్మిస్తే 200 ఇళ్లకు జరగనున్న నష్టం ఫ గతంలోనే రద్దు చేసి మళ్లీ ఏమిటని ప్రశ్నిస్తున్న స్థానికులు ఫ వద్దే వద్దంటూ ఆందోళన బాట -
యాప్‌లో చేర్చాల్సినవి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం మీటికెట్ యాప్‌లో యాదగిరిగుట్ల నృసింహుడి ఆలయాన్ని మాత్రమే ఉంచారు. ఇంకా చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ యాప్‌లో చేర్చాల్సి ఉంది. నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయాలు, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు.. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ వివరాలు, నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ వివరాలను యాప్‌లో నమోదు చేస్తే ఎంతోమందికి ఉపయోగంగా ఉంటుంది. -
‘మీ టికెట్’లో మన ప్రాంతం
ఉమ్మడి జిల్లాలో చోటు కల్పించిన ప్రదేశాలు.. ఫ బోటింగ్ విభాగంలో నాగార్జునసాగర్‌లో బోట్ల ప్రయాణాలకు సంబంధించి నాగార్జునకొండకు వెళ్లేందుకు, జాలీట్రిప్స్కు పిల్లలకు పెద్దలకు టికెట్ రేట్ల వివరాలు, మిర్యాలగూడలోని చెరువులో బోటింగ్ రేట్ల వివరాలను మీటికెట్ యాప్‌లో ఉంచారు. ఫ నాగార్జునసాగర్‌లో బుద్ధవనంలో పార్కింగ్ ఫీజు, ప్రవేశ రుసుం (పిల్లలకు పెద్దలకు) వివరాల ఉన్నాయి. ఫ ఆలయాలు, విహారయాత్రల వివరాలు తెలిపేలా ప్రత్యేక యాప్ ఫ వాటి విశేషాలు, టికెట్ రేట్లు తెలుసుకునే అవకాశం ఫ ఆ యాప్‌లో నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట, మిర్యాలగూడకు చోటు నాగార్జునసాగర్ : రాష్ట్రంలోని దేవాలయాల్లో దైవదర్శనాలు, విహారయాత్రల విశేషాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, పార్కులు, కమ్యునిటీ హాల్స్, పర్యాటక స్థలాల్లో ఎంట్రీ ఫీజు, బోట్లలో ప్రయాణించేందుకు ఎంత రుసుం ఇలాంటి విషయాలు ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు ప్రదేశాలను చేర్చారు. యాప్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ వారు రూపొందించిన ‘మీ టికెట్’ యాప్‌ను ముందుగా ఫ్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్ నంబర్ నమోదు చేసి అకౌంట్లో పిన్ నంబర్ జనరేట్ చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసిన ఫోన్ నంబర్, పిన్ నంబర్ కొట్టి లాగిన్ కావాలి. లాగిన్ కాగానే అందులోని అన్ని అంశాలు మనకు కనిపిస్తాయి. ఈ యాప్ లో ఏముంటాయంటే.. మీ టికెట్ యాప్ ద్వారా అన్ని రకాల టికెట్లను ఒకే ఫ్లాట్‌ఫాం పైకి తెచ్చారు. తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జంతు ప్రదర్శనశాలలు, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ఫ్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్‌కు సంబంధించి టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు. -
కోదాడలో ఆధునిక బస్‌స్టేషన్
రూ.17.95 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ డిపో గోడవైపు బస్టాండ్ నిర్మాణం ఫ హైవే వైపు మల్టీ షాపింగ్ కాంప్లెక్స్ ఫ ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఫ త్వరలోనే సిద్ధంకానున్న ప్లాన్ కోదాడ: కనీస సౌకర్యాలకు నోచుకోని కోదాడ ఆర్టీసీ బస్టాండ్ దశ తిరగనుంది. గత నెలలో కోదాడ బస్టాండ్‌ను పరిశీలించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. శనివారం ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.17.95 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనిధులతో బస్టాండ్, ప్ర యాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు మల్టీస్టేర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. స్వయంగా ఆర్కిటెక్చరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి బస్టాండ్ నిర్మాణం ప్రత్యేకత ఉండేలా ప్లాన్ తయారు చేయనున్నట్లు సమాచారం. డిపో గోడవైపు మూడంతస్తుల్లో బస్టాండ్.. ప్రస్తుతం కోదాడ బస్టాండ్ అస్తవ్యస్థంగా తయారైంది. చాలా స్థలం ఖాళీగా ఉండడంతో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తబస్‌స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను కొంతకాలం పాటు అలాగే ఉంచి డిపో గోడవైపు ఉత్తరముఖంగా మూడు అంతస్తులతో బస్టాండ్‌ను నిర్మించనున్నారు. కింది అంతస్తులో ప్లాట్ ఫాంల నిర్మాణం, విశ్రాంతి గదులు, రెండవ అంతస్తులో అధికారుల కార్యాలయాలు, మూడవ అంతస్తులో సిబ్బంది విశ్రాంతి గదులు నిర్మించనున్నట్లు తెలిసింది. ముందువైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొత్త బస్టాండ్ భవన నిర్మాణం పూర్తయిన తరువాత ప్రస్తుత బస్టాండ్, డ్రైవర్ల విశ్రాంతి భవనం, ముందు వైపుఉన్న షాపింగ్ కాంప్లెక్స్, ఇతర దుకాణాలను పూర్తిగా కూల్చివేసి బహుళ అంతస్తులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నారు. హైవేవెంట ఉండడంతో దుకాణాలు ఏర్పాటుచేసి ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం ఆధునిక హంగులతో గార్డెన్ కూడా నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. రోల్ మోడల్‌గా ఉంటుంది రాష్ట్రంలోనే అన్ని బస్టాండ్లకు రోల్ మోడల్‌గా ఉండేలా కోదాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయిస్తాను. త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీని నిర్మాణంపై ప్రణాళిక తయారు చేయిస్తాను. ఇచ్చిన మాట ప్రకారం కోదాడ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. – నలమాద పద్మావతిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే -
సర్వేను పక్కాగా నిర్వహించాలి
నూతనకల్, మద్దిరాల: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చేపట్టిన సర్వేను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం నూతనకల్, మద్దిరాల మండలం పోలుమల్లలో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సేద్యానికి పనికిరాని భూములను గుర్తించి నివేదికను తయారు చేయాలన్నారు. సాగు భూములకే రైతు భరోసా పడేలా చూడాలని ఆదేశించారు. ఆయనవెంట ఆయా మండలాల తహసీల్దార్లు ఎం.శ్రీనివాసరావు, అమీన్‌సింగ్, డీఈ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. సర్వేల వల్లే అర్హులకు పథకాలు అందట్లే..హుజూర్నగర్: ప్రభుత్వం చేస్తున్న సర్వేల వల్ల అర్హులైన పేదలు సంక్షేమ పథకాలు అందట్లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని అమరవీరుల స్మారక భవన్లో నిర్వహించిన ఆ పాఈ్ట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పథకాలు అందించాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ, జిల్లా, మండల, పట్టణ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. కూలీలకు పనులు కల్పించాలిమునగాల: ఉపాఽధిహామీ పథకం కింద ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ వి.అప్పారావు సూచించారు. ఆదివారం ఆయన మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన అకౌంట్స్ డేటా ఎంట్రీ, పనుల ప్రగతి నివేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరి ఆధార్, బ్యాంకు అకౌంట్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, ఏపీఓ శైలజ, ఉపాధిహామీ టీఏలు, ఎఫ్‌లు పాల్గొన్నారు. జాతీయ భావాలు పెంపొందించాలి సూర్యాపేట టౌన్: పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో జాతీయ భావాలు, నైతిక విలువలు పెంపొందించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్లగొండ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ బంటు జనార్దన్ జీ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర సంఘ చాలక్ డాక్టర్ దాచేపల్లి సుధీర్ జీ, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దండ మురళీధర్‌రెడ్డి, టీపీయూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగంపల్లి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేష్, శ్రీధర్, సంతోష్‌కుమార్, జితేందర్‌రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస్‌రెడ్డి, రామినేని శ్రీనివాస్, శైలజ ,సోమశేఖర్, శ్రీనివాస్‌రావు, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
ఫ్లై ఓవర్ వద్దంటూ నిరసన
అర్వపల్లి: అర్వపల్లిలో ఎలాంటి అవసరంలేని ఫై ఓవర్ నిర్మించవద్దంటూ స్థానికులు ఆదివారం స్థానిక వై జంక్షన్లో హైవేపై నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మించి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ మూడేళ్ల కిందటే రెండు హైవేల విస్తరణ సందర్భంగా వందలాది మంది ఇళ్లు, దుకాణాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే కొత్తగా ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్న వారు మరలా నష్టపోతారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే చొరవ తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణ యోచనను విరమించుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈదుల వీరపాపయ్య, వనం రమేష్, మామిడాల రాజలింగం, దావుల లింగయ్య, గజ్జి శంకర్, డాక్టర్ కిరణ్, కె. నరేష్, పెద్దయ్య, కట్టెల కృష్ణ, నల్లగుంట్ల శ్రీనివాస్, బైరబోయిన సంతు, గిరి, పి. శ్రీనివాస్, కుంభం వెంకన్న, వేణు, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 9.30కు జాన్‌పహాడ్ చేరుకుంటారు. అక్కడ 10.30 వరకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనితో కలిసి ఉర్సు ఏర్పాట్ల పర్యవేక్షణ, 10.30 నుంచి 11.30 వరకు నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. 11.30 నుంచి 12.30 వరకు చెరువుతండాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 కు హుజూర్ నగర్ చేరుకుని 1.30 వరకు హౌసింగ్ కాలనీ పనులపై సమీక్ష తర్వాతగవర్నమెంట్ ఐటీఐ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేస్తారు. 2 నుంచి 2.30 వరకు లింగగిరి – కల్మల్ చెరువు డబుల్ రోడ్డుకు లింగగిరిలో శంకుస్థాపన, 2.30 నుంచి 3 వరకు అమరవరం – ఆలింగాపురం డబుల్ రోడ్డుకు అమరవరంలో శంకుస్థాపన, 3 నుంచి 3.30 వరకు మేళ్లచెరువు – చౌటపల్లి డబుల్ రోడ్డుకు చౌటపల్లిలో శంకుస్థాపన, 3.30 నుంచి 4.40 వరకు కోదాడ – మేళ్లచెరువు రోడ్డుపై కందిబండ వద్ద రెండు బ్రిడ్జిల పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. -
మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి పేర్కొన్నారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధ పరిష్కార చట్టంపై శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న చోట మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి మహిళలు ధైర్యంగా పనులు చేసుకునేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు స్వేచ్ఛగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు. వేధింపులకు గురైన మహిళల దరఖాస్తులను 90 రోజుల్లో కమిటీ మెంబర్లు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, ఏసీడీపీఓ రూప, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష, సభ్యులు లత, అనసూయ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్యనాయుడు, జెండర్ స్పెషలిస్టులు రేవతి, వినోద్, తేజస్విని, క్రాంతి పాల్గొన్నారు. -
ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
గణేష్పహాడ్లోని పెన్నా సిమెంట్స్ వద్ద శనివారం కంపెనీ గనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి మరొక ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. - 8లోచిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు కోసం ఆయా పాఠశాలల్లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. ఆ స్థలంలో ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు, సిగ్నల్స్, బోర్డులతో కూడిన మ్యాప్‌లను కలర్లతో తీర్చదిద్దనున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ రూల్స్ చూపేందుకు అవసరమైన మిషనరీని వినియోగించాల్సి ఉంది. దీనికి ఒక్కో పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.4లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా గ్రామాల్లో దాతల సహకారంతో తీసుకోవచ్చు. ఈ పార్క్‌ను పాఠశాలల్లో ఉండడం వల్ల ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆ విద్యార్థి పెరిగి పెద్దయిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పాఠశాలల్లో ‘చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్’ కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలో అమలు ఉమ్మడి జిల్లాలో 30కి పైగా పాఠశాలల్లో ఏర్పాటుకు సన్నాహాలురెండు వేల చదరపు గజాల స్థలం తప్పనిసరి.. -
రేపటి ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులందరూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాల అమలుకు సర్వే కార్యక్రమాల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2024–25 సంవత్సరానికి గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం, మినిస్ట్రీస్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ విభాగం ఆన్లైన్ పద్ధతిలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు (htt p://ngo.tribal.gov.in) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులకు ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేదీ అని, పూర్తి వివరాల కోసం (htt p://ngo.tribal.gov.in) సంప్రదించాలని సూచించారు. పోలీస్ క్రీడాకారుల ఎంపికసూర్యాపేటటౌన్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 సందర్భంగా వివిధ క్రీడల్లో మెన్, విమెన్ పోలీస్ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాలీబాల్, కబడ్డీ, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షార్ట్ పుట్, ఖోఖో, బ్యాడ్మింటన్, పరుగు పందెం క్రీడల్లో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జిల్లా జట్లుగా ఎంపికై న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి 5వ జోనల్ పోలీస్ జట్లు ఎంపిక చేస్తారు. 5వ జోనల్ పోలీస్ క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రీడాపోటీలను ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఈఓ అశోక్, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు పర్యవేక్షించారు. ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలితిరుమలగిరి (తుంగతుర్తి): ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా చూడాలని ఇంటర్ బోర్డు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి భీమ్‌సింగ్ అధ్యాపకులను ఆదేశించారు. శనివారం తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి చేశారు. కళాశాలలో 90 రోజుల ప్రణాళికపై చర్చించి అధ్యాపకులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రాజమోహన్‌రావు, శ్రీనివాస్, పుల్లయ్య, దయాకర్, నవీన్, వీరయ్య, మహేందర్ పాల్గొన్నారు. 25 వరకు బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే సూర్యాపేటటౌన్ : జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బడి బయట పిల్ల లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ప్రక్రియ ఈ నెల 25తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి బడి ఈడు వయసు ఉండి ఇప్పటివరకు బడిలో నమోదు కాని వారిని, 6 నుంచి 14, 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉండి బడి మానేసిన విద్యార్థులను గుర్తించి ప్రబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వయసుకు తగ్గ తరగతిలో చేర్పించడం కోసం జిల్లాలో గల 64 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో గల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు ప్రణాళిక ప్రకారంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల పర్యవేక్షణలో పనిచేయనున్నట్లు తెలిపారు. ఎల్డీఏలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. -
జేఎన్వీ ప్రవేశపరీక్షకు 76.69 శాతం హాజరు
పెద్దవూర : చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 76.69 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.నాగభూషణం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, సూర్యాపేటలో 9, నల్లగొండ జిల్లాలో 13 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో 2,329 మందికి గాను 1,803 మంది(77.42శాతం), సూర్యాపేట జిల్లాలో 1,525 మందికి గాను 1,199 మంది(78.62శాతం), యాదాద్రి భువనగిరి జిల్లాలో 693 మందికి గాను 485 మంది(69.99శాతం) విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 4,547 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,487 మంది హాజరయ్యారని.. 1,060 మంది గైర్హాజరయ్యారని వివరించారు. దీంతో ఒక్క సీటుకు 44 మంది విద్యార్థులు పోటీ పడినట్లు తేలింది. -
దారి.. మూసేసిరి!
కోదాడ పట్టణంలోని భవానీనగర్‌లో మున్సిపాలిటీ రోడ్డు మూసివేతకోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్‌లో మున్సిపాలిటీ రోడ్డును పట్టాపేరుతో కొందరు ఆక్రమించుకున్నారు. రోడ్డుకు అడ్డంగా డబ్బాకొట్లు ఏర్పాటు చేసి దారిని మూసివేశారు. దీంతో పదేళ్లుగా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్ నుంచి గుడిబండ వెళ్లడానికి వీలుగా భవానీనగర్ ఏర్పాటు సమయంలో లేఅవుట్లో మున్సిపాలిటీ రోడ్డును నిర్మించారు. గతంలో ఇక్కడ నివాసాలు తక్కువగా ఉండడంతో ఆ రోడ్డును పెద్దగా వినియోగించేవారు కాదు. కాల క్రమేణా భవానీనగర్ విస్తరించడంతో ఈ రోడ్డును వినియోగించసాగారు. పది సంవత్సరాల క్రితం ఈ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్ యజమాని తనకు రోడ్డు వెంట స్థలం రిజిస్ట్రేషన్ ఉందని చెబుతూ ఈ రోడ్డును పూర్తిగా మూసివేసి తన ప్లాట్‌లో కలిపేసుకోవడానికి ప్రయత్నించగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీనిపై పెద్ద గొడవ చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అప్పట్లో ఆక్రమణలు తొలగించి అక్కడ రోడ్డును ఏర్పాటు చేశారు. అంతే కాకుండాడా భవానీనగర్నుంచి వచ్చే డ్రెయినేజీని కూడా రోడ్డు పక్కన నిర్మించారు. కాలనీ వాసులు ఈ రోడ్డు నుంచి నేరుగా ఖమ్మం క్రాస్‌రోడ్డుకు, గుడిబండ రోడ్డుకు రాకపోకలు సాగించసాగారు. మూడు డబ్బాకొట్లు ఏర్పాటు చేసి..మున్సిపాలిటీ రోడ్డుకు అడ్డంగా గుడిబండ రోడ్డువైపు ఆరు నెలల క్రితం చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేశారు. తరువాత విడతల వారీగా మూడు డబ్బాకొట్లను ఏర్పాటు చేసి రోడ్డును పూర్తిగా మూసి వేశారు. కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాలనీ వాసులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మున్సిపాలిటీ రోడ్డుకు అడ్డంగా డబ్బాకొట్లను ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అధికారులు ఇదేమిటని అడగడం లేదని కాలనీ వాసులు అంటున్నారు. నాడు రోడ్డన్నారు.. నేడు పట్టా అంటున్నారు..భవానీనగర్ లే–అవుట్ చేసిన సమయంలో అన్నిరోడ్లను గుడిబండ రోడ్డుకు కలిపారు. ప్రస్తుతం మూసి వేసిన రోడ్డుకు పక్కన ఉన్న రోడ్డును కూడా గుడిబండరోడ్డుకు కలిపారు. ఈ ఒక్క రోడ్డు వద్ద క్రాస్ రావడంతో వాస్తుకోసం కొంతమేర ఖాళీ స్థలాన్ని వదిలారు. ఈ కొద్ది స్థలాన్ని మరో సర్వే నంబర్‌గా చూపుతూ కొందరు రిజిస్ట్రేషన్ చేయగా దాన్ని చూపుతూ రోడ్డును మూసి వేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ కొద్ది స్థలానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్లు చూస్తే అసలు విషయం బయడపడుతుందని వారు సూచిస్తున్నారు. ఆ రోడ్డు ప్రాంతంలో మాత్రమే 100 గజాల స్థలానికి వేరే సర్వే నంబర్ రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రోడ్డు మూసి వేస్తే భవానీనగర్ నుంచి వచ్చే డ్రెయిన్ కూడా మూసుకొనిపోతుందని, సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి ఈ ప్రాంతం మునిగిపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు. ఇక్కడ స్థలం విలువ ఎక్కువగా ఉండడం వల్ల అలా చేస్తున్నారని వారు అంటున్నారు. ఖాళీ స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును ఆక్రమిస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో సర్వేచేసి రోడ్డును తెరిపించాలని కాలనీ వాసులు .. అధికారులను కోరుతున్నారు. దశలవారీగా డబ్బాకొట్లు ఏర్పాటు చేసి ఆక్రమణ రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు అధికారులకు కాలనీవాసుల ఫిర్యాదురోడ్లను ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డును కొందరు మూసివేసిన విషయం మా దృష్టికి రాలేదు. తక్షణమే మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ రోడ్లను ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. – రమాదేవి, కోదాడ మున్సిపల్ కమిషనర్