నెమ్మికల్‌లోని చౌడచెరువులో చనిపోయిన చేపపిల్లలు
సూర్యపేట్: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టింది. కానీ ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల చిత్తశుద్ధిలోపంతో అభాసుపాలవుతోంది.
వివిధ కారణాలు చూపుతూ ఇంతకాలం చేప పిల్లలు పోయనేలేదు. అదునుదాటిన తర్వాత ఇప్పుడు అధికారులు ఎన్నికల బిజీలో ఉండగా కాంట్రాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా లెక్కాపత్రంలేకుండా నాసిరకం, చనిపోయిన చేప పిల్లలు పోస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లక్ష్యం 3.50 కోట్ల చేప పిల్లలు
జిల్లాలో 1340 నీటి వనరులు (చెరువులు, కుంటలు) ఉన్నాయి. 134 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు, 5 మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘాలు ఉండగా.. వీటిలో 15,736 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే 2023వ సంవత్సరంలో జిల్లాలోని అన్ని నీటి వనరుల్లో కలిపి దాదాపు 3.50 కోట్ల చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వాస్తవానికి ఆగస్టులోనే చేప పిల్లలను పోయాల్సి ఉంది. కానీ జూన్ 17న టెండర్ల ప్రక్రియ మొదలు కాగా మత్స్యశాఖ జిల్లా అధికారుల తీరుతో మూడు నెలల పాటు సాగింది. చివరకు సెప్టెంబర్ రెండోవారంలో టెండర్ల ప్రక్రియ ముగిసిందని, ఇద్దరు కాంట్రాక్టర్లు చేపపిల్లల పంపిణీకి ముందుకొచ్చినట్లు తెలిపి వారంలోనే పంపిణీని ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇది గడిచి నెలరోజులు దాటింది. నాటినుంచి జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఉసెత్తకుండా జిల్లా మత్స్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినట్లు ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో అధికారుల పర్యవేక్షణ ఉండదని, ఇష్టానుసారంగా చేపపిల్లలను చెరువుల్లోకి వదిలి సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో కాంట్రాక్టర్లు ఉన్నట్లు మత్స్యకారులు అంటున్నారు.
నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె, మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో కొద్దిరోజుల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయా చోట్ల లెక్కాపత్రం లేకుండా చేప పిల్లలను వదిలారు. పులిచింతల ప్రాజెక్టులోనూ చేప పిల్లలను వదిలి పథకానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ఎక్కడా చేప పిల్లలు వదిలిన దాఖలాలు లేవు. వివరణ కోసం జిల్లా మత్స్యశాఖ అధికారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
మండలంలో రెండురోజులుగా చేపపిల్లలను గుట్టుచప్పుడు కాకుండా చెరువుల్లోకి వదులుతున్నట్లు తెలుస్తోంది. మండలంలో 13.80 లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉంది. నెమ్మికల్ చౌడచెరువులో 1.02లక్షల చేప పిల్లలకు గాను కాంట్రాక్లర్లు ఈనెల 17న 7వేలు మాత్రమే పోసినట్లు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వీటిలోనూ సగం వరకు మృతిచెంది ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై గ్రామ మత్స్యసొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ.. చేప పిల్లల పంపిణీ పథకం అమలు తీరుకు నిదర్శనం.
కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయారు
తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్‌లను ఆదుకునేందుకు చేపట్టిన పథకం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. మత్స్య సొసైటీ సభ్యులకు ఎలాంటి లాభం లేకుండా పోతోంది. నెమ్మికల్ చౌడ చెరువులో లెక్కా పత్రం లేకుండా నాసిరకం చేపలను వదిలారు. చాలా పిల్లలు చనిపోయినవే ఉన్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఏటా సకాలంలో పిల్లలను వదలాలి. – గంగరబోయిన శ్రీనివాస్, నెమ్మికల్, సొసైటీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment