మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావ్
సూర్యపేట్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ టీం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో 1,201 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని, వాటిలో 152 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు చెప్పారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌లు పరిశీలించి ఓటర్లు, సిబ్బందికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార మాధ్యమాలతో పాటు బ్యాంకు ఖాతాలపై నిఘా పెంచాలని తెలిపారు. 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకునే సదుపాయంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌లో సిబ్బంది అక్రమ రవాణాలపై నిఘా పెంచాలన్నారు. ఇన్‌చార్జ్ ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రమణనాయక్, డీఎస్పీ ప్రకాష్, ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
రూ.50వేల వరకు మాత్రమే అనుమతి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులు రూ.50వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని కలెక్టర్ వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆమొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారని పేర్కొన్నారు.
రూ.10 లక్షలకు పైగా ఎక్కువ నగదు పట్టుబడితే సంబంధిత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపి, నగదు విడుదలకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో నగదు తీసుకెళ్లాలని సూచించారు.
అధికారులకు ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం, ఏటీఎం స్లిప్, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపారం సేవల నగదు అయితే లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. సీజ్ అయిన నగదు విషయంపై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్‌లో జిల్లా గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇందుకుగాను జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈఓ సురేష్ నంబర్ 83745 66222, కమిటీ కన్వీనర్ డీసీఓ శ్రీధర్ నంబర్ 91001 15651ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment