ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్న యాదాద్రి జిల్లా నోడల్ అధికారి భట్టు నాగిరెడ్డి
సూర్యపేట్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదుకు గత నెల 19వ తేదీ వరకు గడువు ఉండగా, ఈ నెల 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు.
ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారెవరైనా ఉంటారనే ఆలోచనతో ఈ నెల 31వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారే కాకుండా ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.
ఇలా తెలుసుకోవచ్చు
ప్రజలు తమకు ఓటు హక్కు ఉందా లేదా అనే వివరాలను తెలుసుకునేందుకు వివిధ రకాల వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన వెబ్‌సైట్ www.nvsp.in, voters.eci.gov.inతో పాటు రాష్ట్రానికి సంబంధించి www.ceotelangana.nic.in వెబ్‌సైట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
1950 నంబర్‌కు ఫోన్ చేసినా ఓటు హక్కు సంబంధించిన సమాచారం ఇస్తారు. కాగా ఓటు లేని వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చిరునామా మార్పునకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. పూర్తిగా పేరు తొలగింపునకు మాత్రం ఇప్పుడు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
అవగాహన కల్పిస్తున్నాం
అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల కళాశాలలో అవగాహన కల్పిస్తున్నాం.కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఎలా ఓటు వేయాలని అని వీవీ ప్యాట్‌లతో అవగాహన కల్పిస్తున్నాం. – భట్టు నాగిరెడ్డి, భువనగిరి జిల్లా నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment