భువనగిరి పట్టణ వ్యూ
సూర్యపేట్: నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు భువనగిరికి ఎంతో విశిష్టత ఉంది. ఆంధ్ర మహాసభ, తొలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరి కేంద్రంగా ప్రారంభమయ్యాయి. కాలానుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులతో ప్రగతి వైపు పయనిస్తోంది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం మూడోంతులు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంది.
జిల్లాల పునర్విభజనలో జిల్లా కేంద్రంగా మారింది. భువనగిరిలో ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ రెండు సార్లు, సీపీఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిపి ఐదు సార్లు, టీడీపీ ఏడు సార్లు, టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) రెండుసార్లు విజయం సాధించాయి. భువనగిరి నేతలు జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు.
నియోజకవర్గం భౌగోళిక చరిత్ర..
భువనగిరి నియోజకవర్గంలో భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, వలిగొండతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న మత్య్సాద్రి వేములకొండ అర్రూరు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం 257 పోలింగ్ కేంద్రాల్లో 2,11,362 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,05,404 మంది పురుషులు, 1,05,968 మంది మహిళా ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు.
ఈ నియోజకవర్గం సెమీ అర్బన్‌గా ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో భువనగిరి పట్టణం, మండలం, బీబీనగర్, పోచంపల్లి మండలాలు చేరాయి. నియోకవర్గంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అన్ని మండలాలకు మూసీ జలాలు అందుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి టై అండ్ డై చీరల తయారీ, భువనగిరి, బీబీనగర్‌లో పారిశ్రామిక వాడల ఏర్పాటుతో ఎందరికో ఉపాధి కలుగుతోంది. ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి పట్టు చీరలు పుట్టింది ఇక్కడే.
ఆచార్య వినోభాబావే భూదా నోద్యమం ప్రారంభించింది పోచంపల్లిలోనే. ఈ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్– భూపాలపట్నం జాతీయ రహదారి 163 ఉంది. సంగారెడ్డి– భువనగిరి– చౌటుప్పల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కాబోతుంది. దాని వెంట రీజినల్ రైల్ లైన్ మంజూరైంది. ఓఆర్‌ఆర్ నుంచి కొత్తగూడెం వరకు నూతన జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్– కాజీపేట, బీబీనగర్– నడికుడి రైలు మార్గాలున్నాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్ వైద్య సేవలు అందిస్తోంది. సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మంజూరు కానున్నాయి.
పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ‘రావి’
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పోరుబాట నడిపారు రావి నారాయణరెడ్డి. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రావినారాయణరెడ్డి రెండు చోట్లా విజయం సాధించారు. ఎంపీగా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
భువనగిరి నుంచి గెలిచి మంత్రులయ్యారు..
భువనగిరి నియోజవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు మంత్రులయ్యారు. వారిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలుపొంది ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రిగా.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో భుగర్భ వనరుల శాఖ మంత్రి అయ్యారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడి నుంచి గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య మంత్రి వర్గాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలిదశ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment