మహిళలు చరఖాలతో వడుకుతున్న చేనేత చీరలను పరిశీలిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మొదట ఆమె శ్రీరంజన్ సిల్క్ వీవ్స్ యూనిట్‌ను సందర్శించి దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. కూకున్స్ నుంచి సింగిల్ యారన్ దారం తయారీ, దారాన్ని డబులింగ్, ట్విస్టింగ్, వార్పింగ్, వెప్టింగ్ చేసి చివరకు 2ప్లే దారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు.
పట్టుగూళ్ల నుంచి ముడి పట్టును తీసి, మేలు రకమైన పట్టుదారం తయారు చేయడం, దాని నుంచి పడుగు, పేకలను రూపొందించి రంగులద్ది, టై అండ్ డైలో డిజైన్లను రూపొందించడం, ఆసు యంత్రపై చిటికిపోసి పలు రకాల డిజైన్లతో చీరలు తయారు చేయడం తదితర విషయాలను శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి స్పందిస్తూ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టస్సార్ సిల్క్‌ను వినియోగిస్తారని, కానీ మల్బరీ సిల్క్ నాణ్యత బాగుందని తన స్వరాష్ట్రమైన ఒడిశాలో కూడా మల్టీ హ్యాండ్లూమ్ యూనిట్లు నెలకొల్పేందుకు తన పర్యటన ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు.
థీమ్ పెవిలియన్‌లో పర్యటన..
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌లో చేనేతకు సంబంధించిన పలు వస్త్రాల తయారీపై చేనేత కళాకారులు రాష్ట్రపతికి వివరించారు. పుట్టపాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. నూనెలో దారాన్ని నానబెట్టి ప్రాసెసింగ్ చేసి తేలియారుమాల్ వస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిందని చెప్పారు. భూదాన్‌పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరలు, గద్వాల సిల్క్ చీరలు, వరంగల్ రామప్ప చీర, భూపాలపల్లి టస్సర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల గురించి చేనేత జౌళిశాఖ డీడీ అరుణ్‌కుమార్ వివరించారు. నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు, వరంగల్ దుర్రీస్ తివాచీలు, 14వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగాబాద్‌లో నేసిన హిమ్రా చీరల (అప్పట్లో రాయల్ ఫ్యామిలీలకు బహుమతిగా ఇచ్చేవారు) గురించి జౌళిశాఖ డీడీ వెంకటేశం రాష్ట్రపతికి వివరించారు.
ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు
ఇక్కత్ వస్త్రాలు, గద్వాల చీరలు, గొల్లభామ చీరల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. చేనేత కళాకారులు ఆమెకు ఆయా వస్త్రాల తయారీ గురించి చెప్పారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో వస్త్రాల అమ్మకం గురించి సాయిని భరత్, ఎన్‌జీఓ సుధ రాష్ట్రపతికి వివరించారు. పడుగు, పేకల కోసం వినియోగించే 30 చరఖా (రాట్నం)లను మహిళలు తిప్పుతుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని పరిశీలించారు. చరఖా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మగ్గంపై నేత తీరును పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం రూపొందించిన ఆసు యంత్రాన్ని పరిశీలించి దాని పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీరంజన్ వీవ్స్ మల్టీ యూనిట్‌లో పనిచేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్ని సంవత్సరాలుగా మగ్గం పనిచేస్తున్నారని, ఈ వృత్తి వల్ల నెలకు ఎంత కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా చేనేత కళాకారులను తాము మెహర్ అని పిలుచుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి చేనేత కళాకారుల నేత నైపుణ్యం గొప్పగా ఉందని కొనియాడారు.
అనంతరం చేనేత కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ దంపతులు రాష్ట్రపతికి సంబల్‌పురి డిజైన్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీర, పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరను అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఉన్నారు.
పోచంపల్లిలో రెండు గంటలు గడిపిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లిలో రెండుగంటల పాటు గడిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక చాపర్‌లో పోచంపల్లికి చేరుకున్నారు. శ్రీరంజన్ వీవ్స్ యూనిట్‌లో 20 నిమిషాల పాటు వీవింగ్, ట్విస్టింగ్ ప్రక్రియలను పరిశీలించారు. 10.55 గంటలకు బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖా రూమ్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి 11.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. చేనేత కార్మికులచే సన్మానం పొందారు. 12.15 గంటలకు రాష్ట్రపతి చేనేత కార్మికులనుద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం 12.30 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. 12.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఇవి కూడా చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం!
Comments
Please login to add a commentAdd a comment