30 ఏళ్ల తర్వాత సంత పునఃప్రారంభం
నాగారం: నాగారం మండల కేంద్రంలో 30 ఏళ్ల క్రితం నిలిచిన వారాంతపు సంత (అంగడి) కాంగ్రెస్ నాయకుల కృషితో తిరిగి శుక్రవారం పునఃప్రారంభమైంది. అప్పట్లో నాగారంబంగ్లా దగ్గర నాటి కలెక్టర్‌చేతులు మీదుగా ఈ సంత ప్రారంభమై కొద్ది రోజులకే మూతపడింది. ఎట్టకేలకు సంత పునఃప్రారంభం కావడంతో చిరు వ్యాపారులు, రైతులు వివిధ రకాల వస్తువులు, కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మంగదుడ్ల దశరథ, నాయకులు చిప్పలపల్లి మల్సూర్, జాజుల వీరయ్య, కడారి సోమయ్య, కన్నెబోయిన లింగమల్లు, చిప్పలపెల్లి ఉపేందర్, ఆకారపు కిష్టయ్య, చంద్రశేఖర్, శివ, మహిళలు, వ్యాపారులు పాల్గొన్నారు.
నడిగూడెంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలి
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలని పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే అత్యధికంగా నిమ్మ సాగు నడిగూడెం మండలంలోనే ఉన్నదన్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక ఇతర జిల్లాలకు వెళ్లి నిమ్మ పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, ఈ క్రమంలో రవాణా చార్జీల భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగూడెంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేస్తే నడిగూడెం మండలంతో పాటు, మోతె, మునగాల రైతులకు కూడా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
భానుపురి(సూర్యాపేట): యాసంగి– 2023– 24, 2024–25 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలను గడువులోగా ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ రాజేశ్వర్, డీఎం ప్రసాద్, డీటీలు, ఆర్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాఠ్య ప్రణాళిక మండలి అధ్యక్షుడిగా బెల్లి యాదయ్య
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్య ప్రణాళికా మండలి అధ్యక్షుడిగా అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డైరెక్టర్‌గా అరుణ ప్రియ
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్(ఈఎల్‌టీఎస్) డైరెక్టర్‌గా నియమిస్తూ రిజిస్ట్రార్ అలువాల రవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
స్కాలర్‌షిప్‌లు విడుదల చేసే వరకు పోరాడుతాం
నల్లగొండ టౌన్: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసేంత వరకు పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్‌షిప్‌లు రాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, కుంచం, కావ్య, స్పందన సిరి పాల్గొన్నారు.
30 ఏళ్ల తర్వాత సంత పునఃప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment