చలో విద్యుత్ సౌధను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్రంలో 23వేల మంది తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని కోరుతూ ఈనెల 20న టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో విద్యుత్ సౌదాను విజయవంతం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ చింత ఎల్లయ్య, జిల్లా చైర్మన్ మేడె మారయ్య పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 132/33కేవీ సబ్‌స్టేషన్‌లో చలో విద్యుత్ సౌదా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో నరేందర్, ఎంఎ.రహమాన్, మురహరి, రామస్వామి, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను వారబందీ విధానంలో జిల్లాకు ఇస్తున్న గోదావరి జలాలను సోమవారం పెంచారు. తొలుత 400క్యూసెక్కుల నీటిని మాత్రమే వదలడంతో తూములకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. నీటిని పెంచాలనే రైతుల వినతి మేరకు నీటి పారుదల శాఖ అధికారులు 1,002 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69, 70, 71 డీబీఎంలకు వదులుతున్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని నీటి పారుదల శాఖ బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు.
నిరంతరం నిఘా ఉంచాలి
భానుపురి (సూర్యాపేట): పెద్దగట్టు జాతర ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. పెద్దగట్టు జాతర నేపథ్యంలో రెండవ రోజు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించి మాట్లాడారు. జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. అనంతరం ప్రత్యేక అధికారులతో కలిసి పలు సెక్టార్లను సందర్శించారు. విద్యుత్, మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, ఆర్డీఓ వేణుమాధవ్ రావు, ఈఓ కుశలయ్య, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేంత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాత సేవ, విశేష పూజలు, హోమం, పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత కల్యాణతంతు పూర్తి చేశారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.
మహాశివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర పూజలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment