పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రోడ్లపైనే బురదనీరు పారుతోంది. దీంతో దోమల బెడద పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వీధి ధీపాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో బల్బులు వేయించే పరిస్థితి లేక చీకట్లోనే మగ్గాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసిపోయింది. అప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే అప్పటి నుంచి గ్రామాల్లో పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సమస్యలు తిష్ట వేశాయి. దీనికి తోడు నిధుల లేమితో అభివృద్ధి పనులు కొనసాగక ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు.
పేరుకుపోతున్న సమస్యలు
● సూర్యాపేట జిల్లా అర్వపల్లి రెండు జాతీయ రహదారులపై ఉండడంతో నిత్యం పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. ఏడాది కాలంగా నిధులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. సూర్యాపేట–జనగామ, నకిరేకల్–తానంచర్ల రహదారులపై సెంట్రల్ లైట్లు వెలగడం లేదు. గ్రామపంచాయతీలో నిధుల్లేక మరమ్మతు చేయించడం లేదు. విద్యుత్ బిల్లులు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు పిచికారి చేయడం వంటి పనులు ఆగిపోయాయి.
● నడిగూడెం మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పారిశుద్ధ్య సమస్యతో పాటు, వీధి దీపాలు వెలుగడం లేదు. ప్రత్యేక అధికారులు కూడా నిధుల లేమితో మొక్కబడిగా విధులను నిర్వహిస్తున్నారు.
● మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో చెత్త తీసుకెళ్లడానికి ట్రాక్టర్ డీజిల్‌కే వారానికే రూ.4వేల పైనే అవుతున్నట్లు వాపోతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను గ్రామ పంచాయతీ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఏడాది కాలంలో రెండు ధపాలుగా నిధులను కేటాయించినా అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
అప్పులు చేసి పనులు చేయిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారడంతో గ్రామ కార్యదర్శులు అప్పులు చేసి పనులను చేయిస్తున్నారు. అయితే గతంలో కార్యదర్శులు చేయించిన పనులకు సంబంధించిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కార్యదర్శి రూ.లక్ష వరకు అప్పు చేసి పనులను చేపట్టినా ఆ డబ్బులు ఇంతవరకు రాలేదని వాపోతున్నారు. వీధిలైట్లు, బోర్లు కాలిపోవడం, ట్రాక్టర్ల మరమ్మతులు, డీజిల్ ఖర్చులు అన్నీ భరించాల్సి వచ్చిందని, ఆ డబ్బులే ఇంకా రానప్పుడు ఎలా పనులు చేయిస్తామని ప్రశ్నిస్తున్నాయి. ఇక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రత్యేక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోతూ, సరిగ్గా పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన
ఫ అందుబాటులో ఉండని అధికారులు
ఫ రోడ్లపైనే పారుతున్న మురుగు నీరు
ఫ ఏడాది కాలంగా ప్రజలకు
తప్పని ఇబ్బందులు
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment