వెళ్లొస్తాం.. లింగమయ్య
సూర్యాపేట/ చివ్వెంల: ఐదు రోజుల పాటు సాగిన పెద్దగట్టు జాతర గురువారం మకరతోరణాన్ని సూర్యాపేటకు తరలించడంతో ముగిసింది. ప్రతి రెండేళ్లకొకసారి వచ్చే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర ఈనెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు లింగమయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తులు, జోగినుల నృత్యాలు, డోలు చప్పుళ్లు, కటారు విన్యాసాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
సూర్యాపేటకు మకరతోరణం..
జాతర ప్రారంభానికి ముందు శ్రీ లింగమంతుల స్వామి అలంకరణ కోసం సూర్యాపేట నుంచి కోడి, వల్లపు వంశస్తులు మకర తోరణం తెచ్చారు. జాతర ముగియడంతో తోరణాన్ని తిరిగి సూర్యాపేటకు తరలించారు. లింగమంతుల స్వామి గుడిపైన ఉంచిన పసిడి కుండను దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేటకు చెందిన అలిశెట్టి వంశస్తులు జాతరకు ముందు తీసుకువచ్చి జాతర ముగిసిన అనంతరం తీసుకువెళ్లారు.
జాతర విజయవంతంగా ముగిసింది
భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు జరిగిన పెద్దగట్టు జాతర గురువారంతో విజయవంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు, ఆలయ పాలకవర్గం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంగా పని చేశాయని, పోలీసు శాఖ అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఫ ముగిసిన పెద్దగట్టు జాతర
ఫ వైభవంగా మకరతోరణం తరలింపు
ఫ అధికారులు, పాలకవర్గ సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం
వెళ్లొస్తాం.. లింగమయ్య
Comments
Please login to add a commentAdd a comment